Oct 13,2022 23:16

అరకులోయ గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌ లో విద్యార్థులతో భోజనం రుచి చూస్తున్న చైర్మన్‌.

ఆహార కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి
ప్రజాశక్తి- అరకులోయ :
గిరిజన సంక్షేమ వసతి గహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ సిహెచ్‌ విజరు ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అరకులోయలోని సిఎహెచ్‌ స్కూల్‌, గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, గవర్నమెంట్‌ హైస్కూల్‌, ఎండపల్లి వలస గురుకులం, కెజిబివి పాఠశాల వసతి గహాలను సందర్శించారు. మెనూ అమలుపై ఆరా తీశారు.కొన్ని పాఠశాలల్లో మెనూ అములపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సరిచేసుకోవాలని హెచ్చరించారు. రేషన్‌ సరుకుల తూకాల్లో మోసం చేస్తే సహించేది లేదన్నారు. ఎవరు తప్పు చేసినా ఆహార కమిషన్‌ ఊరుకోదన్నారు.
ఇప్పటికే కడప జిల్లాలో రెండు, విశాఖలో ఒక డిపోలపై '6ఎ' కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో అక్రమాలకు పాల్పడిన ఒక అంగన్వాడి టీచర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించామన్నారు. అనంతరం స్థానిక జిసిసి గోడౌన్‌ను తనిఖీ చేశారు. కాలం చెల్లిన కొన్ని పప్పు ప్యాకెట్లను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని సరఫరా చేసిన సివిల్‌ సప్లై అధికారులపై చర్యలు తీసుకుని, కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 180 కందిపప్పు బ్యాగులను సీజ్‌ చేశారు. అనంతరం పద్మాపురం అంగన్వాడీ కేంద్రం, గత్తరగుడ గుడ గ్రామంలో సందర్శించారు.కార్యక్రమంలో జెడ్‌పిటిసి శెట్టి రోష్ణి, ఎంపిటిసి దురియా ఆనంద్‌కుమార్‌, పద్మాపురం సర్పంచ్‌ పెట్టెలి సుస్మిత, జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్‌, చింతపల్లి , పాడేరు జిసిసి డిఎంలు, పార్వతమ్మ, డి. సింహాచలం, సివిల్‌ సప్లై డిఎం గణేష్‌కుమార్‌, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, సివిల్‌ సప్లై డిటి ప్రశాంత్‌, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వేణుగోపాల, అరకు లోయ జిసిసి మేనేజర్‌ వెంకటేష్‌, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, సిడిపిఒ శారద, ఇన్‌ఛార్జి ఎటిడబ్ల్యుఒ వైకుంఠరావు, ఎంఇఒ భారతీరత్నం పాల్గొన్నారు.
ప్లాస్టిక్‌ కాదు, పోర్టిఫైడ్‌ రైస్‌
డుంబ్రిగూడ : ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలుపుతున్నట్లు వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని పౌష్టికాహారానికి సంబంధించిన పోర్టీపైడ్‌ రైసును కలుపుతున్నామనిరాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజరుప్రతాప్‌ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అరుకు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు పెడుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోర్టిపైడ్‌ రైస్‌లో పొలికేషన్‌, ఐరన్‌తో పాటు ఇతర విటమిన్లు ఉంటాయని, ప్రతి కిలో బియ్యంలో పది గ్రాముల పోర్టిఫైడ్‌ రైస్‌ను కలుపుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదప్రజలకు, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో సిఎం జగన్‌ ఈ చర్యలు తీసుకున్నారన్నారు. దీనిపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భోజన మెనూ అమలులో అవకతకవలు జరిగితే వెంటనే రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 9490551117కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్టోర్‌రూమ్‌ను సందర్శించి, గుడ్డు చిన్నవిగా ఉండడంపై ప్రశ్నించి, సరైన సమాధానం రాకపోవడంతో డిప్యూటీ వార్డెన్‌ను మందలించారు. .కార్యక్రమంలో జిసిసి డిఎం వి సింహాచలం, ఎంఇఒ వి త్రినాధరావు, హెచ్‌ఎం సునీత పాల్గొన్నారు.