ప్రజాశక్తి-హుకుంపేట:ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పి.ఓ వి.అభిషేక్ హెచ్చరించారు. బుధవారం మజ్జివలస గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. విద్యార్దుల మెనూ పరిశీలించారు. పదవ తరగతి విద్యార్ధులు సాంఘిక శాస్త్రం, గణితం మొదటి పాఠ్యాంశాలోని ప్రశ్నలు వేయగా సమాధానాలు చెప్పక పోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యా ప్రమాణాలు మెరుగు పడకపోతే ఉపేక్షించనని హెచ్చరించారు. మెనూ తనిఖీ చేసి విద్యార్ధులతో కలిసి భోజనం రుచి చూసారు. మెనూ సక్రమంగా అమలు చేయక పోవడం, విద్యార్ధుల నూరు శాతం హాజరు లేదని ప్రధానోపాయుడుకి షోకాజ్ నోటీస్ జారీ చేస్తామన్నారు. 60 మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జెవికె కిట్లు పంపిణీ పై ఆరా తీసారు. వంట గదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమాధికారిణి ఎల్.రజని, తదితరులు పాల్గొన్నారు.










