ప్రజాశక్తి-పాడేరు:గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ బాధ్యతల్ని 3మాసాలకే పరిమితం చేసి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆశ్రమ ప్రధానోపాధ్యాయులు, ఏటిడబ్ల్యువోలకు ఐటిడిఏ పిఓ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. నాణ్యమైన పోషకాహరం అందిస్తే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి బాగా చదువు కుంటారని అన్నారు. శనివారం రాత్రి ఐటిడిఏ సమావేశ మందిరంలో 11 మండలాల ఏటిడబ్ల్యూఓలు, హెచ్‌డబ్ల్యూఓలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిసిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి హాస్టల్ నిర్వహణ బాధ్యతల్ని మరొక ఉపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. ఫేషియల్ యాప్, బైజూస్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుందని గుర్తు చేసారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన మెనూ అమలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు గుడు,్ల పాలు సక్రమంగా సరఫరా చేయాలని ఆదేశించారు. జగనన్న కానుక విద్య కిట్లు ప్రతీ విద్యార్థికి పంపిణీ చేయాలన్నారు. విద్యా క్యాలెండరు, పాఠ్యాంశాల ప్రణాళిక సక్రమంగా అమలు చేయాలన్నారు. డైట్ బిల్లులను ప్రతీనెలా ఐదవ తేదీలోపు జెఎన్‌బి నివాస్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. విద్యార్థుల హాజరును ప్రతీ రోజు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు.
శ్రీహరికోటకు విజ్ఞాన యాత్ర:-
8, 9, 10 వతరగతి విద్యార్థులు 120 మందితో శ్రీహరి కోటకు విజ్ఞాన యాత్ర నిర్వహిస్తామని. ప్రతీ పాఠశాల నుండి ఒక విద్యార్థి పేరును సూచిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పిఒ సూచించారు. ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బాలికల ఆశ్రమ పాఠశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పిఓ ఆదేశించారు. విద్యార్థులకు మూమెంట్ రిజిష్టరు అమలు చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిర్ణీత సమయానికి పదిహేను నిమిషాలు ముందుగా చేరుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యం శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిసిసి ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులపై కచ్చితంగా స్టాంపు వేయాలని సూచించారు. నాణ్యమైన నిత్యావసర సరుకులు, గ్యాస్ బండలను సకాలంలో ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేయాలని జిసిసి అధికారులను ఆదేశించారు. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని సోలార్ వాటర్ హీటర్ల మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు వేడినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. తాగునీటి పథకాలు వినియోగం లోకి తీసుకుని రావాలని పిఒ పేర్కొన్నారు. మన బడి నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలకు రివాల్వింగ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నాడు నేడు పనులకు నిధులు కొరత లేదన్నారు. మన బడి నాడు నేడు రెండవ దశలో పాఠశాలలను సుందరంగా తీర్దిదిద్దాలని తెలిపారు. నాడు నేడు పనులు వద్దని రద్దు చేస్తే పాఠశాల ప్రధానోపాధ్యాయుడుని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతా వరణం ఉండాలని చెప్పారు.
డిసెంబర్ లో గిరి విజ్ఞాన సంబరాలు
గత ఏడాది ఐటీడీఏ నిర్వహించిన విధంగానే ఈసారి డిసెంబర్ రెండవ వారంలో గిరి విజ్ఞాన సంబరాలు నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గోపాల కృష్ణ వెల్లడించారు. గిరిజన విద్యార్థుల్లో ప్రతిభా నైపుణ్యాలను ఆవిష్కరించేందుకు గిరి విజ్ఞాన సంబరాలు ఎంతో దోహద పడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి పాఠశాలలో నెలకు ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల క్రమశిక్షణ విద్యా సామర్ధ్యాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కొండల రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, ఏటిడబ్లూఓలు ఎల్. రజని, క్రాంతి కుమార్, మల్లిఖార్జునరావు 11 మండలాల ఆశ్రమ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, హెచ్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.










