స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 500మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
ప్రజాశక్తి- మధురవాడ: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గీతం ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో రెండురోజుల పాటు కొనసాగే మెగా రక్తదాన శిబిరాన్ని గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితులలో ఉన్నవారిని రక్షించడానికి ఏటా 5 కోట్ల యూనిట్ల్ల రక్తం అవసరమౌతుందని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
గీతం బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ అంజనచౌదరి మాట్లాడుతూ దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమౌతోందన్నారు. రక్తదానం చేయడం ద్వారా దాత శరీరంలోనూ కొత్త రక్తకణాలు వృద్ధి చెంది, ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన విద్యార్థులను, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులను గీతం ప్రోవైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, గీతం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా తొలిరోజున 500 మందికి పైగా వలంటీర్లు రక్తదానానికి ముందుకొచ్చారని ఎన్‌్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ తెలిపారు. మంగళవారం కూడా రక్తదాన శిబిరం కొనసాగుతుందన్నారు. రక్తసేకరణలో ఎన్‌టిఆర్ బ్లడ్‌బ్యాంక్ ,లయన్స్‌క్లబ్, కెజిహెచ్ రక్తనిధికేంద్రాలు పాల్గొంటాయని వెల్లడించారు.










