Apr 03,2023 00:05

సమావేశంలో మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు

ప్రజాశక్తి -కంచరపాలెం : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదలచేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన మాధవధారలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో డైట్‌, బిఇడి చేసిన సుమారు 10 లక్షల మంది డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, నిరుద్యోగుల ఆ త్మహత్యలకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 25 వేల పోస్టులకుపైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే విద్యాశాఖ మంత్రి మాత్రం నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే డీఎస్పీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు పరమావధిగా పరిపాలన చేస్తున్నారు తప్ప ఖాళీ పోస్టుల భర్తీపై ధ్యాస లేదన్నారు. ఈ కారణంగానే గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పాదయాత్ర సమయంలో యువతకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్‌ కుమార్‌, విజయ, శరత్‌, మురళీ, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.