ప్రజాశక్తి-బాపట్ల: మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన మేధో మథనంతో ప్రపంచానికి అవసరమైన బృహత్తరమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టొచ్చని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సింగిశెట్టి గురునాథరావు అన్నారు. శుక్రవారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన రెండ్రోజుల పాటు మెకానికల్ విభాగంలో జరిగే రెండో అంతర్జాతీయ సదస్సు (బెక్టగాన్- 2023)కు సింగిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విలక్షణ సాంకేతిక విద్యా కేంద్రంగా వినుతికెక్కిన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బెక్టగాన్ ఉత్సవాలు నిర్వహించడం సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందని అన్నారు. సాంకేతిక విప్లవంతోనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లోని పదునైన మేధస్సుకు బాపట్లలో నిర్వహించే బెక్టగాన్- 2003 ఒక చక్కని వేదిక అన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక సంస్థల నుంచి వివిధ అంశాలపై 80కి పైగా పరిశోధన పత్రాలు ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి యేడు నిర్వహించే ఈ సదస్సు ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి అనేక పరిశోధనాంశాలు ఒకే వేదికపై చర్చించడం ద్వారా సాంకేతిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ షేక్ నజీర్ మాట్లాడుతూ 60కి పైగా సాంకేతిక, సాంస్కతిక, సాహిత్య, క్రీడా విభాగాల పోటీల్లో జాతీయ స్థాయిలో పాల్గొంటున్నాయన్నారు. 7 వందల మంది వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు దొప్పలపూడి రామమోహనరావు, గెల్లి దిలీప్, టిసిఎస్ సంస్థ డిజైన్ ఇంజినీర్లు ఈఎస్ చక్రవర్తి, రమేష్, మెకానికల్ విభాగాధిపతి టి నాంచార్య, కోఆర్డినేటర్లు జె లక్ష్మీ లలిత, ఏ ప్రవీణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










