ప్రజాశక్తి-భట్టిప్రోలు: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహా నాడులో ప్రకటించిన మేనిఫెస్టోను ముందుకు తీసుకు వెళ్లేందుకు మహాశక్తి కార్ క్యాంపెయిన్ చేపడు తున్నట్లు మాజీమంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. వేమూరులో మహాశక్తి కార్ క్యాంపెయిన్‌ను ఆయన ప్రారంభించారు. ఆనందబాబు మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు మహాశక్తిని ప్రారంభించామని, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు, 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద రూ.15 వేలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తారని అన్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు. మినీ మేనిఫెస్టో, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ కార్ క్యాంపెయిన్ ద్వారా తిరిగి పథకాలను వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అనుబంధ విభాగం మహిళలు, నాయకులు పాల్గొన్నారు.










