Oct 06,2023 22:56

మాట్లాడుతున్న అల్లాడి దేవ కుమార్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి, రక్షణకు ప్రాధాన్యమివ్వాలని దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ (డిబిఆర్‌సి) రాష్ట్ర కార్యదర్శి ఎ.దేవకుమార్‌ అన్నారు. దళిత ఆదివాసి మేనిఫెస్టో-2024 అంశంపై నరసరావుపేట స్టేషన్‌ రోడ్డులోని విజయ రెసిడెన్సి మీటింగ్‌ హాల్‌లో జిల్లాస్థాయి సదస్సు డిబిఆర్‌సి రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ ఎం.చిన్నప్ప అధ్యక్షతన శుక్రవారం జరిగింది. దేవకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు 23 శాతానికి పైగా ఉన్నారని వారికి సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని కోరారు. దీనిపై డిబిఆర్‌సి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి వివరాలు సేకరిస్తామని, ఆ అంశాలను రాజకీయ పార్టీలకు ఇస్తామని చెప్పారు. హ్యాండ్సఫ్‌ కంపాషన్‌ సంస్థ డైరెక్టర్‌ సన్నీ మాట్లాడుతూ దళిత, గిరిజనులకు ప్రభుత్వం విద్యార్థినీ, విద్యార్థులకు స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళలకు కుట్టు శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను ప్రభుత్వాలు చూపాలని కోరారు. డిబిఆర్‌సి రాష్ట్ర మహిళా ట్రైనింగ్‌ కో-ఆర్డినేటర్‌ హేమలత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల పిల్లలు, మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో వెనకబడి ఉన్నారని, దాడులు, హత్యలు, అత్యాచారాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. డిబిఆర్‌సి నరసరావుపేట సిటీ కో-ఆర్డినేటర్‌ వేణు మాట్లాడుతూ సంచార జాతులు, చిత్తు కాయితాలు ఏరుకొని డంపింగ్‌ యార్డుల్లో జీవించేవారు, గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు ఇప్పటికీ దుర్భర దారిద్య్రంలో ఉన్నారని, విద్య దూరమై, కూటి కోసం, వలసలు వెళుతున్నారని చెప్పారు. వీరి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డిబిఆర్‌సి ఏరియా మహిళా కో-ఆర్డినేటర్‌ జి.కోటిరత్నం, ఎంఆర్‌పిఎస్‌ అధ్య క్షులు ఎ.మోహన్‌, కె.కోటేశ్వరరావు, కెవిపిఎస్‌ జిల్లా కార్య దర్శి జి.రవికుమార్‌, ప్రధం సంస్థ కో-ఆర్డినేటర్‌ ఫణిద నాయక్‌, బేడ బుడగ జంగాల సంఘం నాయకులు కె.శ్రీని వాసరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.