ఒక పూజారిని నిధి ఇవ్వాలని కోరగా 'ఎవరి కోసం ఈ నిధి? రామాలయం కోసమా?' అని అడిగారు. 'రాముడికైతే కావాల్సినంత డబ్బుంది. రైతులకే లేదు. కాబట్టి రైతు ఉద్యమానికి నేను సైతం...' అంటూ వంద రూపాయలు విరాళం ఇచ్చి తోడ్పడటం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు ఏవీ మినహాయింపు లేకుండా రైతు సంఘీభావ నిధికి కేంద్రాలు అయ్యాయి. ఎంత మొత్తం ఇచ్చారన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వానికి నిరసన గళం వినిపించడం, రైతులకు సంఘీభావం తెలపడమనే గొప్ప సందేశం ప్రజలు అందించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం పంజాబ్‌కే పరిమితమైందని...దేశం లోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వాములు కావటం లేదు కాబట్టి, వారందరూ కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుకూలంగా ఉన్నారని... ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది. ఇది రాజకీయ ఉద్యమం అని, ప్రజల మద్దతు లేదని ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. ఈ వాదనలన్నీ తప్పని విజయవాడ నగర ప్రజలు ఆచరణలో రుజువు చేశారు.
ఉద్యమిస్తున్న రైతులు ఒంటరి వారు కాదని, ఆ ఉద్యమానికి విస్తృతమైన ప్రజల మద్దతు ఉందని...విజయవాడలో జనవరి 25న ఒక్కరోజు 'రైతు ఉద్యమ సంఘీభావ కమిటీ' చేపట్టిన రైతు రక్షణ నిధి కార్యక్రమం తేటతెల్లం చేసింది. ఒక్క రోజులోనే 40,000 మంది ప్రజలు రైతు రక్షణ నిధికి తమ వంతు కర్తవ్యంగా రూ.4,01,652 నిధి ఇచ్చి రైతులకు అండగా నిలబడ్డారు. వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు 750 మంది 250 దళాలుగా ఏర్పడి 150 కేంద్రాలలో 400 హుండీల ద్వారా ఈ నిధి వసూలు చేశారు.
నోటుతో నిరసన
ఉద్యమాలతో నిరసనలు తెలియచేయటం చూశాం, ఓటుతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం చూశాం. కానీ నోటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడం, రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపడం ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్నాం. రైతుల దీనావస్థపై ప్రజలు తమ సానుభూతి కురిపించారు. అపూర్వమైన రీతిలో స్పందించి... స్వచ్ఛందంగా తమకు తోచిన విరాళాలు అందించారు. రైతు ఉద్యమానికి అండగా వున్నామని రుజువు చేశారు. ''నేను సైతం-రైతు కోసం'' అనే నినాదంతో ''రైతుకు అండగా విజయవాడ నగరం'' నిలబడింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై వివిధ వర్గాలలో ఉన్న అసంతృప్తిని సాధారణ ప్రజలు తమ విరాళాల ద్వారా వ్యక్తం చేశారు. వైసిపి, టిడిపి అధినేతలు బిజెపి ప్రభుత్వానికి భయపడి, తలొగ్గి పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు ఓటు చేసినా సాధారణ ప్రజలు మాత్రం నిర్భయంగా, బాహాటంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఒక వైపు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోవాలనే వక్రబుద్ధితో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు రామాలయ నిధి వసూలు చేస్తున్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయల విరాళాలు సమర్పించుకుంటూ తమ ప్రభు (మోడీ) భక్తి ప్రకటిస్తున్నాయి. ఢిల్లీ రైతు ఉద్యమానికి మాత్రం సామాన్యులు, అట్టడుగు ప్రజలు తమ కష్టార్జితం నుండి రూపాయి, రూపాయి ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఒక పూజారిని నిధి ఇవ్వాలని కోరగా 'ఎవరి కోసం ఈ నిధి? రామాలయం కోసమా?' అని అడిగారు. 'రాముడికైతే కావాల్సినంత డబ్బుంది. రైతులకే లేదు. కాబట్టి రైతు ఉద్యమానికి నేను సైతం...' అంటూ వంద రూపాయలు విరాళం ఇచ్చి తోడ్పడటం గమనార్హం. ఆధ్యాత్మిక వాదులు అందరూ మతోన్మాదులు కారు. మానవత్వంతో స్పందించేవారు అన్ని తరగతులలో, అన్ని వర్గాలలోనూ వున్నారని దీనితో స్పష్టమైంది. ఒక యువతి కొద్దిరోజులుగా ముంతలో తాను దాచుకున్న డబ్బును రైతుల కోసం ముందుకొచ్చి ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయం. ఓ పోలీస్ అధికారి, ఆయనతోపాటు వాహనంలో వచ్చిన సిబ్బంది అందరూ హుండీలో నిధి వేసి వెళ్లారు. నిధి వసూళ్లు కార్యక్రమాన్ని ఉద్యోగరీత్యా పరిశీలించడానికి వచ్చిన పోలీసు ఇంటిలిజెన్స్ సిబ్బంది ఒకరు, తాను ప్రత్యక్షంగా ఇస్తే ఏమవుతుందో అనే సందేహంతో ఒక రిక్షా కార్మికుడి ద్వారా హుండీలో రూ.50 వేయించడం చూస్తే...పోలీసులు మొదలు మాజీ సైనికుల వరకు రైతులకు అందరి మద్దతు వుందని అవగతమౌతుంది. ఈ కార్యక్రమాల్లో ఫోటోలు తీయడానికి వచ్చిన ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫోటోగ్రాఫర్ కార్యక్రమంలో అరగంట సేపు ఉండి వివిధ భంగిమల్లో ఫోటోలు తీశారు. చివరికి వెళుతూ వెళుతూ తాను కూడా హుండీలో విరాళం వేసి వెళ్ళటం ఆశ్చర్యకరం. బడా కార్పొరేట్ మీడియా సంస్థ యాజమాన్యాలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నా కింది స్థాయి సిబ్బంది... రైతులతో మమేకం అవుతున్నారనటానికి ఇదే తార్కాణం. అత్యధిక మంది ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. కార్యకర్తలు గమనించకుండా వెళ్ళిపోతుంటే పిలిచి మరీ హుండీలో డబ్బులు వేసిన వారున్నారు. కరోనా వల్ల పనులు లేవని, అందువల్ల ఎక్కువ డబ్బు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూనే తమకు తోచినంత సహాయం చేశారు.
కొంతమంది యాచకులు భిక్షాటనతో సమకూర్చుకున్న దానిలో రెండు రూపాయలు, ఐదు రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని ప్రదర్శించడం వెలకట్టలేని విషయం. ఈ నిధి కార్యక్రమాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా ఢిల్లీకి నిధి పంపడం గమనార్హం. ప్రత్యేకించి మహిళలు ముందుకు వచ్చి వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి నిధి ఇప్పించటం హర్షణీయం. వివిధ రూపాలలో అనేక వర్గాల వారు తోడ్పడ్డారు. హుండీలు, ప్రచార సామగ్రిని ఉచితంగా అందించి తాము రైతు బిడ్డలమేనని తెలియజెప్పారు. వైసిపి, టిడిపి అధిష్టాన వర్గాలు ఎలా వున్నా కింది స్థాయి కార్యకర్తలు, వారి జనం మాత్రం నిధి ఇచ్చారు, అన్ని విధాలా సహకరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాదు. పట్టణ ప్రజలు సైతం రైతాంగ సమరానికి అండగా ఉన్నారని చెప్పటానికి ఇంతకుమించిన ఉదాహరణలు అవసరం లేదు.
చిన్న విరాళం.. పెద్ద సందేశం..
సాధారణ ప్రజల్లోనే కాదు. కార్యకర్తల్లో సైతం ఉత్సాహం పెల్లుబికింది. ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనలేకపోయామనే బాధ వున్నా, ఇక్కడ నుండే వారికి సంఘీభావం తెలియజేశామనే సంతృప్తి వారి మాటల ద్వారా వ్యక్తమైంది. కొంతమంది పూర్తి రోజు పాల్గొంటే మరికొంతమంది ఉద్యోగాలకు వెళుతూ కొన్ని గంటలపాటు పాల్గొని తాము కూడా భాగస్వాములం అయ్యామనే అనుభూతి పొందారు. కొంతమంది తలపాగాలు చుట్టుకొని, ధోవతులతో రైతు రూపంలో వచ్చి ఉత్సాహపర్చటమే కాదు, రైతులకు సంఘీభావంగా నిధి వసూలు చేశామని గర్వపడ్డారు.
తెల్లవారుజామున మైదానాల దగ్గర వ్యాహ్యాళికి వచ్చేవారి వద్ద వసూలు ప్రారంభించి...రాత్రి 11, 12 గంటల వరకు నైట్ ఫుడ్‌కోర్ట్‌ల వద్ద కూడా యువ కార్యకర్తలు వసూలు చేయటం వారి ఉత్సాహాన్ని వెల్లడిస్తోంది. న్యాయవాదులు తాము మాత్రం తక్కువ కాదంటూ కోర్టుల్లో గంట వ్యవధి లోనే వేల రూపాయల నిధి వసూలు చేయడం విశేషం. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే మున్సిపల్ కార్మికులు తమ విధి నిర్వహణ చేస్తూనే హుండీల ద్వారా ఇళ్ల దగ్గర నుండి రైతు రక్షణ నిధి వసూలు చేయడం కార్మిక, కర్షక మైత్రికి అద్దం పడుతోంది.
అంగన్వాడీ టీచర్లు తమ పరిధి లోని పసిపిల్లల తల్లిదండ్రుల నుండి నిధి వసూలు చేసి తమ బాధ్యత నిర్వహించారు. ప్రయాణికులు, కిరాయిల కోసం ఎదురు చూసే ఆటో కార్మికులు, ప్రయాణికుల నుండి నిధి వసూలు చేసి మేము సైతం అంటూ పాల్గొన్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థి నేతలు హుండీలు వుంచి విద్యార్థులను చైతన్య పరిస్తే విద్యార్థులు వారికి తోచిన విరాళాలు అందులో వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు ఏవీ మినహాయింపు లేకుండా రైతు సంఘీభావ నిధికి కేంద్రాలు అయ్యాయి. ఎంత మొత్తం ఇచ్చారన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వానికి నిరసన గళం వినిపించడం, రైతులకు సంఘీభావం తెలపడమనే గొప్ప సందేశం ప్రజలు అందించారు.
ఇంత పెద్ద రైతు ఉద్యమం జరుగుతుంటే జనం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేసిన శ్రేయోభిలాషులు, కార్యకర్తలు వున్నారు. ప్రజలు అవకాశవాదులని బాధపడే వారూ వున్నారు. తప్పు కేవలం ప్రజలది కాదు. వారిని భాగస్వాములు చేసే రూపాలు ఎంచుకుంటే జనం కూడా వారి వంతు బాధ్యత నిర్వహిస్తారని ఈ కార్యక్రమం రుజువు చేసింది. ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనటం ముఖ్యమే, కానీ ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో ఉద్యమాలకు నైతిక, ఆర్థిక మద్దతు ఇవ్వడం కూడా కీలకమే. నిధి ఇవ్వటం ఒక నిరసన రూపమేనని ప్రజలు తెలియచెప్పారు. నిధి కూడా ఒక ఉద్యమ రూపమేనని మరింతగా అర్ధమైంది.
పాలకులపై ప్రజల మనసులో ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయటానికి, రైతు ఉద్యమం పట్ల సంఘీభావాన్ని తెలియజేయటానికి వివిధ మార్గాలు, రూపాలు అనుసరించాలి. సంతకం, సోషల్ మీడియాలో నైతిక మద్దతు మొదలు ఉద్యమ నిధి ఇవ్వటం వరకు అన్ని మార్గాలు వినియోగించుకోవాలి. ప్రజలను భాగస్వాములను చేసే కొత్త రూపాలు ఎంచుకోవాలి. ఉద్యమాలు విజయవంతం కావాలంటే వివిధ వర్గాల ప్రజల యొక్క విస్తృత మద్దతు అన్ని మార్గాలలో సమీకరించుకోవాలి. కార్మిక, కర్షక మైత్రి సిద్ధాంతాలకే పరిమితం కారాదు.
ఆచరణలో ఈ రూపాలన్నీ అనుసరణీయమే...
ప్రజాపంథా ఆచరణలో పెట్టడానికి, ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటానికి, కార్యకర్తలకు ప్రజలతో అనుబంధాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని మరోసారి వెల్లడయ్యింది. ప్రజలు నిధి ఇవ్వటంతో సరి పెట్టలేదు. ఉద్యమ అభివృద్ధికి సూచనలు చేశారు. సలహాలు ఇచ్చారు. సున్నితంగా విమర్శలు చేశారు. ఢిల్లీ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రంలో మరింత విస్తృతమైన ఉద్యమాలు అవసరమని కొందరు సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన కార్యక్రమాలు అవసరమని మరి కొందరు సలహా ఇచ్చారు. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి మోడీ చర్యలు తమను కుంగదీశాయని ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారులున్నారు. కొంతమంది యువత, విద్యార్థులు...రైతు ఉద్యమాలు, ప్రభుత్వాల విధానాలు పట్టించుకోవడంలేదని అర్ధమవుతోంది. యువతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. ఒక్కరోజే అయినా..నిధి వసూలు కార్యక్రమం చిన్నదే అయినా...పెద్ద సందేశం ఇచ్చింది. అనేక అనుభవాలను నేర్పింది. ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు భవిష్యత్తుకు మార్గనిర్దేశకం చేశారు.
(వ్యాసకర్త 'ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య' కన్వీనర్)
సిహెచ్. బాబూరావు











