Aug 17,2023 21:55

ఫొటో : మృతి చెందిన చిరుత కళేబరం

         మడకశిర రూరల్‌ : మడకశిర మండలం మేళవాయి గ్రామంలో మరో చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం గుర్తించారు. బుధవారం నాడు గ్రామ సమీపంలో ఓ ఆడ చిరుత కళేబరాన్ని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పరిశీలనకు వెళ్లిన అధికారులకు అక్కడ మరో మగ చిరుత కళేబరం లభ్యం అయ్యింది. రెండు రోజుల వ్యవధిలో ఇక్కడ రెండు చిరుత కళేబరాలు లభ్యం అయ్యాయి. అయితే ఈ రెండు చిరుతలు కూడా మంగళవారం రాత్రే మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మృతిచెందిన రెండు చిరుతల వయస్సు 18 నెలలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతలు మృతి చెందిన ప్రాంతాన్ని జిల్లా ఫారెస్ట్‌ అధికారి రవీంద్రనాథ్‌ రెడ్డి, పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్‌ అమర్నాథ్‌ రెడ్డిలు గురువారం ఉదయం సిబ్బందితో కలిసి పరిశీలించారు. రెండు చిరుతల విష ఆహారం తినడం వల్ల మృతి చెందాయా..? లేక అనారోగ్యంతో మరణించాయా.? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ ప్రాంతంలో మృతి చెందిన వాటి తల్లి చిరుత కూడా సంచరించే అవకాశం ఉన్నందున గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. కాగ చిరుతల సంచారంతో మేళవాయి సమీప గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలోకి వణ్యప్రాణులు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో వరుసగా రెండు చిరుతలు మృతి చెందడంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.