Oct 24,2021 13:13

ఈ మకిలి పడుతున్న
సమాజపు వైపరీత్య పోకడల్ని
ముళ్లకంపల్లా ఏపుగా పెరుగుతున్న
కరుడుగట్టిన కులపిచ్చి పాచిని
పక్షవాతపు వ్యాధిలా పట్టిన పక్షపాతాన్ని
మంచికి ముసుగేసి
చెడును మసిపూసి మారేడుకాయను
చెయ్యాలనే దౌర్భాగ్యపు బుద్ధుల్ని
ప్రజల పక్షాన నిలవని
ఎవరికోసమో భుజాన మోస్తున్న
దుర్మార్గపు పాత్రికేయాన్ని
అడుగడుగునా వ్యవస్థల్ని
గుప్పిట్లో పెట్టుకుంటూ
ప్రజాభివృద్ధిని అడుగడుగునా ఆటంకపరుస్తూ
చేసే అన్యాయపు పోకడల్ని

చూసీ చూడనట్టు
నటించే కళ్లున్న మధ్యస్థ కబోదీ
సామాజిక స్పృహలేని
చైతన్య హృదయం లేని
పచ్చి స్వార్థపు హీనపు మనిషీ
నీ పిరికితనపు జాడ్యాన్ని
నిర్లిప్తపు తత్వాన్ని
సంఘపు బాధ్యాతారాహిత్యాన్ని
త్యజించి మేల్కొను
నిద్రపుచ్చిన నీలోని రక్తాన్ని పొంగించి
తిరుగుబాటు కాగడా ఎగరేసి
మంచికోసం మనుగడకోసం
నిజా నిజాల్ని గ్రహించి
నీ ధర్మంగా గుర్తించి
సమాజ సుస్థాపన కోసం మేలుకోరా పౌరుడా

నాగముని.యం
94908 56185