ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న 'ధరిత్రీ దినోత్సవం' జరుపుకుంటున్నాం. భూమి, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. వాతావరణంలో విపరీత మార్పులు నేడు ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయి. మితిమీరిన ఇంధన వనరుల వినియోగం, పారిశ్రామికీకరణ వల్ల ప్రకృతి వ్యవస్థలు దెబ్బ తిని వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. మోతాదుకు మించి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగి అనేక దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తోంది. నేడు భూమిపై సంభవించే ప్రకృతి వైపరీత్యాలు మానవ మనుగడను సైతం ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఇప్పటికే 75 శాతానికి పైగా భూములు భూసారాన్ని కోల్పోయాయి. భూసారం తగ్గడం వల్ల 2010 లోనే ప్రపంచ స్థూల ఉత్పత్తి పది శాతం మేరకు తగ్గింది. 2050 నాటికల్లా పంట దిగుబడులు 10 శాతం క్షీణించనున్నాయి. నేడు దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపుగా ఆరు కోట్ల టన్నుల ఘన వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 48 శాతం జనాభా తీవ్రమైన నీటి కొరతతో సతమతం అవుతోంది. దేశంలో ప్రవహిస్తున్న అనేక నదులలో అక్రమంగా ఇసుక తవ్వడం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. నదుల చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి క్రమక్షయానికి లోనై వరదలకు కారణమవుతోంది. నదుల సహజ స్వరూపాలు, వాటి ప్రవాహ వేగంలో తేడాలు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి బీడు అటవీ భూములను పంట భూములు మార్చేసే ఈ ప్రక్రియ విచ్చలవిడిగా కొనసాగుతోంది అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, జలవనరుల వినియోగం స్థాయికి మించి పోతుంది.
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలే తప్ప వాటిని ఆదాయ వనరులుగా, ఆర్థిక లక్ష్యాలు సాధించుకోవడానికి మార్గాలుగా మార్చుకోకూడదు. పర్యావరణ పరిరక్షణకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూనే ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయమై గట్టి చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం సౌర విద్యుత్ లాంటి వాటిని వినియోగిస్తూ, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగే సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలి. అడవుల పెంపకం, జీవ వైవిధ్య సంరక్షణ కోసం పాటు పడాలి. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలి. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉంటుంది. నిర్ణీత ప్రణాళికలతో పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి జరగాలి. అప్పుడే ప్రకృతికి మనిషికి మధ్య గల బంధం సమతుల్యంగా ఉంటుంది.
- ఆదిత్య పకిడే, సెల్ : 83096 39797










