
* సమర్థ, సమగ్ర, సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
* కేంద్ర సూచీల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
* జిల్లాకు టిడిపి చేసిన అభివృద్ధి శూన్యం
* పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - నరసన్నపేట, పోలాకి: 'నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో ప్రతి కుటుంబానికీ ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో మేలు జరిగింది. మీ కుటుంబానికి మేలు జరిగితేనే వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయండి' అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రెండో దశ సామాజిక సాధికార బస్సు యాత్రను పోలాకి మండలం మబగాంలో వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం నరసన్నపేట పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ సమర్థవంతమైన, సమగ్రమైన, సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారని, రాష్ట్రంలో చోటుచేసుకున్న మార్పులను ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకు అవసరమైన వసతులు, సౌకర్యాలను జగన్ పాదయాత్ర చేసినప్పుడు గమనించి, సిఎం కాగానే అమలు చేశారని, ఇందుకోసం ఎవరూ పోరాటాలు చేయలేదని చెప్పారు. 29 రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు, ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారని, ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువగా నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో చెప్పాలని విపక్షాలను డిమాండ్ చేశారు. చంద్రబాబు కంటే ఐదు రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించారని, వేర్వేరు విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేయాలని ఎవరైనా మీ ఇంటికి వస్తే, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో ఓట్లడిగిన టిడిపి నాయకులను చర్చకు రమ్మనాలని సూచించారు.
కేంద్ర సూచీల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం : స్పీకర్
జగన్ పాలనలో అభివృద్ధి సూచీల్లో రాష్ట్రం అగ్రస్థాయికి చేరిందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జిడిపి పెరుగుదల అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ లేకపోగా, సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితి జగన్ పాలనలోనే వచ్చిందన్నారు. అర్హతలే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తున్నారని చెప్పారు. ప్రజల సొమ్ములను తమ ఖాతాల్లోకి మళ్లించుకుని టిడిపి నాయకులు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి స్కిల్ స్కామ్ పేరుతో కోట్ల రూపాయలను దోచుకుని చంద్రబాబు జైలుపాలయ్యారని విమర్శించారు. జగన్‌ని మళ్లీ సిఎం చేసుకోవడం ప్రజల చారిత్రక కర్తవ్యమన్నారు.
జిల్లాకు టిడిపి చేసిందేమిటి?
తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇస్తే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోబెట్టడానికి రాలేదని, సిఎం జగన్ దగ్గరుండి సీట్లో కూర్చొబెట్టి బిసిలకు తాను ఇచ్చే గౌరవం ఏమిటో చాటిచెప్పారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పరాజు అన్నారు. బిసిలను అవమానించిన చంద్రబాబు ఎక్కడ, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలిపిన జగన్ స్థానం ఎక్కడో ప్రజలు ఆలోచించాలని కోరారు. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఏమీ చేయకపోగా, ఇప్పుడు అధికారం ఇస్తే సంపద సృష్టించేస్తానని మాయమాటలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 23 సంస్థలను కేంద్రం రాష్ట్రానికి ఇస్తే వాటిలో ఒకటి కూడా జిల్లాకు తేలేని చేతకాని ఎంపీ రామ్మోహన్ నాయుడు అని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి టిడిపి చేసింది శూన్యమన్నారు.
జగన్‌ని మళ్లీ సిఎం చేసుకోవాలి : కృష్ణదాస్
రాష్ట్రంలో మంచి పాలన సాగుతోందని ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విపక్షాలన్నీ కలిసి ప్రజా నాయకుడిని ఓడించడానికి తయారవుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనార్టీలు గర్వంగా తలెత్తుకునేలా జగన్ చేశారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వైసిపి గెలుచుకోవడం ఖాయమన్నారు. యాత్రలో ఎమ్మెల్యేలు వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కళ్యాణి, నర్తు రామారావు, జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు పేరాడ తిలక్, అంధవరపు సూరిబాబు, డిసిసిబి చైర్మన్ కె.రాజేశ్వరరావు, ధర్మాన కృష్ణచైతన్య, దువ్వాడ వాణి, డోల జగన్ తదితరులు పాల్గొన్నారు.