ప్రజాశక్తి-నెల్లూరు :మేలు జాతి పశువుల అభివృద్ధితోనే పాడి పరిశ్రమ లాభదాయకం ఉంటుందని, ఈ నేపథ్యంలో లింగ నిర్ధారిత వీర్యంతో పెయ్యదూడలు పుట్టే విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు పశుగణాభివృద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ అన్నారు. గురువారం నగరంలోని వెటర్నిరీ పాలీ క్లీనిక్ క్యాంపులో పాడి రైతులకు-జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా లింగ నిర్ధారిత 'వీర్యము.. ప్రయోజనాలు, ఏడాదికి ఒక పెయ్యదూడ' పొందడం అన్న అంశంపై ఒక్క రోజు శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న విజయకుమార్ మాట్లాడుతూ రైతులు ప్రతి ఏడాది మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపు నిచ్చారు. జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రీయ గోకుల మిషన్ సౌజన్యంతో పెయ్య దూడల ఉత్పత్తి పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 2022-23 ఏడాదికి 5700 పశువులకు వీర్యనాళికలు (లింగనిర్ధారిత ) పంపిణీ చేశామన్నారు. అనంతరం పశు సంవర్ధక శాఖ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ టి.సోమయ్య 'లింగ నిర్ధారిత వీర్యం' అన్న అంశంపై పవర్‌పాయింట్ ద్వారా రైతులకు పూర్తి శిక్షణా అవగాహన కల్పించారు. లేగ దూడుల పెంపకంపై డాక్టర్ ఎస్.జయచంద్ర, ఏడాదికి ఒక దూడ పొందడంపై డాక్టర్ ఆర్.వసంతలు రైతాంగానికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ ఎం.నాగమణి, బి.మల్లికార్జున, డాక్టర్ ఎ. రమేష్‌నాయక్ ఉన్నారు.










