ప్రజాశక్తి - మక్కువ : 'వడ్డించేవాడు మనవాడు అయితే... కడబంతిలో కూర్చొన్నా అందుతుందన్న చందగాన ఉంది విద్యుత్ శాఖ అధికారులు పనితీరు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కైతే ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని ముందే వాడుకోవచ్చన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
మండలంలోని మార్కొండ పుట్టి పంచాయతీలో లోవోల్టేజ్ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ 40 కెవిఎ ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణం చేపట్టి సమస్యను లేకుండా చేయాలని తలించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ గత ఏడాది ప్రతిపాదనలు చేసింది. అలాగే మంజూరు కూడా అయ్యింది. ఈ పనుల కోసం సంబంధిత కాంట్రాక్టర్‌కు మే నెలలో కూలీలకు బిల్లులు కూడా సుమారు రూ.48వేలు పైచిలుకు చెల్లింపులు కూడా చేపట్టారు. అయితే ఈ పని అప్పట్లో పూర్తి చేయలేదు. ఇటీవల విద్యుత్ శాఖలో జరిగిన పలు అంశాలు కూడా ఈ పని వెలుగులోకి రావడానికి కారణమైంది. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్న పని ఈనెల రెండో వారంలో పూర్తి చేశారు. ఆదరా బాదరాగా చేసిన పనిని చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. కాంట్రాక్టర్‌కు విద్యుత్ శాఖ అధికారులు ముందే బిల్లులు చెల్లింపు విషయమై సంబంధిత కాంట్రాక్టర్‌కు విద్యుత్ శాఖ అధికారులకు ఉన్న బంధం ఇట్టే తెలుస్తోంది. ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ చేతులు కలిపితే ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు ఈ విషయంపై ఆరా తీస్తే మరింత అవినీతి వెలుగు చూసే ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.










