Oct 18,2023 00:02

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తెల్ల బంగారాన్ని ఇస్తుందనుకున్న పైరు చివరికి మేకలు, గొర్రెలకు మేతగా మారుతోంది. పల్నాడు జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే తీవ్ర వర్షాభావం, గులాబీ రంగు పురుగు ఉధృతి నేపథ్యంలో ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లోనే రైతులు సాగు చేశారు. వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట, ప్రాంతాల్లో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో ఒక మోస్తరుగా ఉంది. రైతుల ఆందోళనకు తగ్గట్టుగానే పత్తి పైరును సమస్యలు చుట్టుముట్టాయి. ఒకవైపు గులాబీ రంగు పురుగు మరోవైపు ఎర్ర తెగులు రసం పీల్చు పురుగులు విస్తృతంగా వ్యాపించడంతో పైరు ఎదుగుదల తగ్గింది. నాలుగు అడుగులకు పైగా ఎత్తు పెరగాల్సిన మొక్కలు రెండడుగుల లోపే ఉన్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులంటున్నారు. ఇదిలా ఉండగా వర్షాల్లేక పైరు బెట్టకొస్తోంది. చాలాచోట్ల పూత కూడా సరిగా రావడం లేదు. ఇది కూడా దిగుబడిని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే గత ఐదేళ్లుగా రెండు మూడు క్వింటాళ్లకు మించి రావడం లేదు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ఆలస్యమవగా జూన్‌లో కొంతమేరకు కురిశాయి. ఆగస్టులో అసలు లేవు. దీంతో ఎండిపోయిన మొక్కలను పీకేసిన రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి మరోసారి విత్తారు. ప్రస్తుతం పత్తికి రసం పీల్చే పురుగు ఉధృతంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో వ్యవసాయాధికారులు ఉంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. మరోవైపు ఇప్పటికే రూ.15 వేలకుపైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పైరు బెట్టకు రావడంతో ఇక లాభం లేదని భావించిన రైతులు ఆ పొలాలను జీవాలు మేపుకోవడానికి రూ.500-1000కి ఇచ్చేస్తున్నారు.
వాతావరణ బీమాను వర్తింపజేయాలి
కె.రామారావు, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు.

పత్తి రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. సాగుదారుల్లో సగానికిపైగా కౌల్దార్లే ఉన్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులు అదనంగా మరో రూ.10 వేలు కౌలు చెల్లించారు. తీవ్రమైన వర్షాభావం నేపథ్యంలో బెట్ట పరిస్థితులు ఏర్పడి పూత, పిందె రాలి పోతున్నాయి. దీనికి తోడు గులాబీ రంగు పురుగు, తెగుళ్ల బెడదతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. బెట్ట పరిస్థితుల మధ్య ఏ విత్తనాలు మంచివో? ఏవి నకిలీవో తెలుసుకునే అవకాశం ఉండడం లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఐ.మురళి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి.

గులాబీ రంగు పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. పైరు పూత, పిందె, కాయ దశల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గులాబీ రంగు పురుగు ఆశించిందన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున తగిన యాజమాన్య చర్యలను వ్యవసాయాధికారులు, సిబ్బంది నుండి రైతులు తెలుసుకుని వాటిని పాటించాలి.
గులాబీ రంగు పురుగు నివారణ ఇలా..
గులాబీ రంగు పురుగు ఉధృతి గుర్తించడానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పొలంలో అమర్చుకోవాలి. ఎక్కువ సంఖ్యలో పురుగు ఉంటే 10-20 బుట్టల వరకు పెట్టుకోవాలి. వీటిల్లో వరుసగా 3 రోజుల పాటు 8 చొప్పున పురుగులు పడితే పంటకు తీవ్రమైన నష్టం కలుగుతుందని అంచనా వేయాలి.
పైరు 40-50 రోజుల దశలో పురుగు లార్వా నివారణకు వేపనునే పిచికారీ చెయ్యాలి. 1000 పిపిఎం వేపనూనే అయితే ఎకరాకు 500 మిల్లీ లీటర్లు, 1500 నుండి 3000 పిపిఎం వేప నూనె అయితే ఎకరాకు 1 లీటర్‌ చొప్పున పిచికారి చేసుకోవాలి. 50-80 రోజుల దశలోని పైరులో గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఉంటే 400 మీల్లీ లీటర్ల క్వినాల్‌ ఫాస్‌ 25 ఇసి, లేదా 400 మిల్లీ లీటర్ల ప్రొఫినోఫాస్‌ 50 ఇసి లేదా 500 మిల్లీ లీటర్ల క్లోరిఫైఫాస్‌ 20 ఇసి, లేదా 250 మిల్లీ లీటర్ల పిరిడాలిల్‌ మందులను 200 లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు పిచికారి చెయ్యాలి. 80 రోజుల నుండి ఆఖరి దశలో ఒకటి రెండు సార్లు మాత్రమే సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులైన సైపర్మైత్రిన్‌ 25 ఇసి, 200 మీల్లీలీటర్లు లేదా లాంబ్డాసైహలోత్రిన్‌ 5 ఇసి, 200 మీల్లీ లీటర్లు లేదా 320 మీల్లీ లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు పిచికారీ చేయాలి.