ప్రజాశక్తి-కలెక్టరేట్ : దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశానికి హానికరమని దేశంలోని 5 గుర్తింపు గలిగిన పోర్టు ఫెడరేషన్ల కో-ఆర్డినేషన్ కమిటీ కో-చైర్మన్ పికె సమంతరారు, జనరల్ కన్వీనర్ పిఎం మహమ్మద్ హనీఫ్ తెలిపారు. ఐదు ఫెడరేషన్ల సమావేశం శని, ఆదివారాలలో నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించారు. సమావేశంలో చేసిన నిర్ణయాలను వివరించడం కోసం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్ లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 11 మేజర్ పోర్టులు ఉన్నాయన్నారు. 10 మేజర్ పోర్టులోని 35 బెర్తులను అదాని, అంబానీలకు కట్టబెట్టారని విమర్శించారు. విశాఖపట్నం మేజర్ పోర్ట్ లోని 31బెర్త్‌లు ఉండగా వీటిలో పదింటిని ఇప్పటికే ప్రైవేటీకరణ చేశారని, మరో 4 బెర్తులను ప్రైవేటీకరణ చేయడానికి ఏర్పాటు చేశారని తెలిపారు. పోర్టుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉందని ఆదాయపు కొరతను ఎదుర్కోవడానికి ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమన్నారు. పోర్టు ఉద్యోగులపై అనేక పొదుపు చర్యలను విధించిన కేంద్రం, బిఒటి ఓటర్లకు అన్ని రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఏటా ఇవ్వాల్సిన బోనస్‌ను ప్రోడక్టివిటీకి లింకు చేశారన్నారు. రెండేళ్లుగా బోనస్ చెల్లించటం లేదన్నారు. పిఎల్‌ఆర్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన పేరివిజన్ గడువు పూర్తయినప్పటికీ ఏడాది కాలంగా కాలయాపన చేస్తున్నారన్నారు. ట్రస్టీల నియామకాలను పూర్తిగా మార్చేశారన్నారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 19న అన్ని మేజర్ పోర్టుల ఎదుట అన్ని ఫెడరేషన్ల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఫెడరేషన్ కోశాధికారి బిసిహెచ్ మసేన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ నాయకులు జికె.కృష్ణమూర్తి, డికె.శర్మ, సిఐటియు నాయకులు సిడి.నందకుమార్, విఎస్.పద్మనాభరాజు, ఎఐటియుసి నాయకులు ఎస్‌ఎస్.శ్రావణ్, వైఎస్.ప్రకాశరావు, ఐఎన్‌టియుసి నాయకులు ఎ.బలరామన్, జి.చందు, ఎస్‌ఆర్ ఎపరాజ్, టిఎ.నరేంద్రరావు, ఎల్.సత్యనారాయణ, ఎన్‌వి.రాజేంద్రన్, కె.మంగయ్య నాయుడు, థామస్ సెబస్టియన్ పాల్గొన్నారు.










