Sep 06,2023 00:19

మేఘాద్రిపేటలో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

ప్రజాశక్తి-గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గం పరిధి నేవల్‌ ఎంప్లాయీస్‌ నివాసముంటున్న మేఘాద్రిపేట కాలనీలో ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పర్యటించారు. కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వల్ల ఉద్యోగులు నిర్ణీత సమయంలో విధులకు హాజరుకావడం కష్టంగా ఉందని, హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌, ఎస్‌బిసి పోర్ట్‌, హెచ్‌పిసిఎల్‌, కోరమండల్‌, రైల్వే, ఆర్‌సిఎల్‌, ఎస్సార్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ మార్గంలో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కార్మికులు డ్యూటీకి వెళ్లే సమయంలో మార్గంలో గూడ్స్‌ ట్రైన్స్‌ రాకపోకల వల్ల గేటు మూసేయడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఉద్యోగులు విధులకు ఆలస్యం అవుతున్నందున ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. లెవెల్‌ క్రాసింగ్‌ సమీపంలో ఉన్న గ్రానైట్‌ యార్డుకు పెద్ద పెద్ద లారీలు, ట్రాలర్స్‌ రాకపోకలతో ట్రాఫిక్‌ సమస్యతో పాటు రహదారి గతుకుల మయమైందని, దీంతో ఇక్కడ నీరు నిలిచి బురదలో వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని, పలుమార్లు ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ యార్డును వేరే చోటకు తరలించాలని ఎమ్మెల్యేను ఉద్యోగులు కోరారు. రహదారి మరమ్మతుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 56వ వార్డు కార్పొరేటర్‌ సరగడం రాజశేఖర్‌, 57వ వార్డు టిడిపి అధ్యక్షులు అజరు, జిల్లా టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి నాగార్జునరావు, ఇఎన్‌సి సెక్రటరీ సిహెచ్‌ శ్రీనివాస్‌, పిఎంఎల్‌ వర్క్‌ కమిటీ సెక్రటరీ నాయుడు, ఎన్‌సిసిఇ ప్రెసిడెంట్‌ మోహన్‌, నూకరాజు, శివశంకర్‌ నానాజీ, క్యాంటీన్‌ శ్రీను, రాజు పాల్గొన్నారు.