Jul 17,2022 01:04

సహస్రబుదేకు జ్ఞాపిక అందజేస్తున్న శ్రీభరత్‌

ప్రజాశక్తి - విశాఖపట్నం : యూనివర్సిటీల్లో విద్యార్థుల నిజమైన మేధస్సుకు పదును పెట్టేలా ప్రణాళికలు ఉండాలని భారత ప్రభుత్వ సాంస్కృతిక సంబంధాల విభాగం ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసిసిఆర్‌) అధ్యక్షుడు డాక్టర్‌ వినరు ప్రభాకర్‌ సహస్రాబుదే అన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీలో సంప్రదాయ రీతిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ వ్యవస్థలను, సంస్థలను సమర్థంగా నడిపే నాయకులను తయారు చేయులేకపోవడం ప్రధాన లోపమని అభిప్రాయపడ్డారు. లీడర్‌షిప్‌ సైన్స్‌, ఇనిస్టిట్యూషన్‌ బిల్డింగ్‌ సైన్స్‌, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ ప్లానింగ్‌, ఇంటర్‌ పర్స్‌నల్‌ కమ్యూనికేషన్‌ వంటి అంశాలపై ప్రత్యేక కోర్సులు అవసరమని అన్నారు. పిహెచ్‌డి పరిశోధనలు కాపీల నుంచి బయట పడాలని, గైడ్‌ ఫ్రొఫెసర్లు నిజమైన మేధకు పదును పెట్టాలని సూచించారు.
గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర సాధకులుగా ఎప్పటికస్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కురసెరా మాద్యమం ద్వారా ఈ ఏడాది 25 వేల ఆన్‌లైన్‌ కోర్సులకు లైసెన్స్‌ తీసుకోనున్నామని వెల్లడించారు. ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతి విభాగంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు.