మేధోశక్తి పెంచేందుకే క్విజ్ పోటీలు : కమిషనర్
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
విధ్యార్థుల్లో మేధోశక్తి పెంచేందుకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి తుడా సర్కిల్ వద్దనున్న మునిసిపల్ కార్పొరేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆదివారం విధ్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ తిరుపతి స్మార్ట్ సిటీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 14న జరిగే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంటర్ స్కూల్స్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7, 8, 9, 10 తరగతులకు చెందిన నలుగురు విద్యార్థులు ఒక టీముగా, 110 స్కూళ్ల నుండి మొత్తం 440 మంది విద్యార్థిని విద్యార్థులు ఆదివారం జరిగిన క్విజ్ కాంపిటీషన్ కు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో మాస్టర్ మైండ్స్ వారి నిర్వహణలో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, మూవీ, సైన్స్, స్పోర్ట్స్, బిజినెస్, బుక్స్, పర్సనాలిటీస్ పైన ప్రశ్నలు ఉంటాయని, ఈ క్విజ్ పోటీల్లో 110 టీములకు గాను 8 టీములను ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయబడుతుందన్నారు. నవంబర్ 14వ తేదీ తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో సెలెక్ట్ కాబడిన 8 టీములకు ఫైనల్ రౌండ్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోజు మొదటి స్థానం సాదించిన టీమ్ కు లక్ష రూపాయలు, రెండవ టీంకు 50 వేల రూపాయలు, మూడో టీంకు 25 వేల రూపాయలు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం క్విజ్ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీం వద్దకు కమిషనర్ హరిత స్వయంగా వెళ్లి పరిశీలిస్తూ, వారి యొక్క డౌట్లకు సమాధానాలు ఇస్తూ విధ్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ పి.రవి, ఈవెంట్ మేనేజర్ కిషన్, విధ్యాసాగర్ రెడ్డి, శశి, గిరి పర్యవేక్షించారు.










