ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కార్మికులందరూ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పి.రామరాజు, చిన్ని రాంబాబు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సిఐటియు మండల నాయకులు కె.రాంబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మేడే సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 8 గంటల పని దినం కోసం జరిగిన కార్మిక పోరాటమే మేడేగా ప్రసిద్ధి కెక్కిందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కార్మిక వర్గం 8 గంటల పని దినాన్ని సాధించిందని చెప్పారు. నేడు కార్మిక హక్కులను నిలుపుకునేందుకు మరో పోరాటం చేయవలసిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు వారికే ఖర్చు చేయాలన్నారు. మండలంలో జరిగే మేడే వేడుకల్లో అంగన్‌వాడీ, ఆశ, మిడ్డేమీల్ వర్కర్లు, తాపీ పనివార్ల సంఘం ఎలక్ట్రికల్, కార్పెంటర్, హమాలీ, ఆటో, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చంద్రావతి, అమ్మిరాజు, కె శివప్రసాద్, నాగేంద్ర, కామరాజు, నూకరాజు, పి ప్రసాద్, మాణిక్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు.










