Apr 30,2023 21:53

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
       మే డే వేడుకలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు పోచమ్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ, అనంతరం సభ, ర్యాలీ నిర్వహిస్తున్నామని, మండలంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం పోచమ్మ మాట్లాడుతూ కార్మికుల పోరాటం ద్వారా 16 గంటల పని విధానాన్ని ఎనిమిది గంటల పని దినంగా సాధించుకున్న మొదటి విజయంగా ఈ మేడే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ కార్మిక హక్కులను కుదిస్తున్న నేటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ వర్గాలు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నాయని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలియజేస్తున్నాయని తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు అర్జించి పెట్టటానికి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మేడేను స్ఫూర్తిగా తీసుకుని కార్మికవర్గం ఒకటై ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపూడి జగదాంబ, గోగులమ్మ పి.సుధారాణి. జి.కోమలి, నాగలక్ష్మి, రాణి, సుజాత, సుకన్య పాల్గొన్నారు.
పెదవేగి : కార్మికవర్గం ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మికచట్టాలను మోడీప్రభుత్వం సంపన్నుల కోసం మార్పులు చేయడం సిగ్గు చేటని, కార్మికచట్టాలను మేడే స్ఫూర్తితో సాధించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మార్కెట్‌ యార్డ్‌లో మే డే పోస్టర్లను ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో ఒక పెట్టుబడిదారుల కోసం దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గమన్నారు. కార్మిక - కర్షక వర్గం తమ రక్తాన్ని ధారపోసి సష్టించిన సంపదను కొల్లగొట్టడం సిగ్గు చేటన్నారు. కార్మికవర్గానికి రక్షణగా ఉన్న 44 చట్టాలను కార్పొరేట్ల కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చారన్నారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన బిజెపితో మన రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు అంటకాగుతున్నాయన్నారు. మేడే స్భూర్తితో బిజెపి నుంచి దేశాన్ని, ప్రజనీకాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మేడే గోడపత్రికలను విడుదల చేశారు. పెదవేగి మండలంలో జరిగే మేడే జండా ఆవిష్కరణలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.ప్రసాద్‌, సుబ్బారావు, దుర్గారావు వెంకన్న పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:కార్మిక, కర్షకులు వేలాదిమంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, పార్టీ ప్రజాసంఘాల నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి కోసం చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు ప్రాణత్యాగం ఫలితంగా మేడే ఏర్పడిందని గుర్తు చేశారు.పోలవరంలో మేడే వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు. మండలంలో సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలన్నారు. బుట్టాయగూడెం రోడ్‌లోని పాత పంచాయతీ కార్యాలయం నుండి ఆర్‌టిసి బస్టాండ్‌ వరకూ ప్రదర్శన, అనంతరం బస్టాండు వద్ద సభ నిర్వహిస్తున్నామన్నారు.