ప్రపంచ కార్మిక దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి - ఏలూరు
ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీప్రభుత్వం అత్యంత సంపన్నుల కోసం మార్పులు చేయడం సిగ్గుచేటని, కార్మికచట్టాలను మేడే స్ఫూర్తితో పటిష్టంగా అమలు చేసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షలు ఆర్.లింగరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, లౌకికవాదం, ఫెడరలిజం, మత సామరస్యం అంటే ఏంమాత్రం ఇష్టంలేని బిజెపి దేశంలో మతోన్మాదాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఒకశాతం పెట్టుబడిదారుల కోసం దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గమన్నారు. కార్మికవర్గానికి రక్షణగా ఉన్న 44 చట్టాలను కార్పొరేట్ల కోసం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుందన్నారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన బిజెపితో మన రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన అంటకాగుతున్నాయన్నారు. మేడే స్పూర్తితో బిజెపి నుంచి దేశాన్ని, ప్రజానీకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 27 మండలాల్లో అన్ని పట్టణాల్లో మేడే పతాకావిష్కరణలు, ప్రదర్శన, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులోకం పెద్దసంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నేతలు బి.సోమయ్య, కె.విజయలక్ష్మి, జి.రాజు, ఎం.నాగమణి, కె.వెంకట్రావు, ఎస్.రాంబాబు, ఆర్‌విఎస్.నారాయణ, ఎస్‌కె.సుభాషిణి, వి.సాయిబాబా పాల్గొన్నారు.










