
పెట్టుబడిదారీ విధానంపై జరిగిన మొదటి తిరుగుబాటు మేడే. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మేడే నిరసనలు, కార్మిక వర్గ ఉద్యమాలు వర్గ పోరాట సిద్ధాంతాన్ని పదును పెట్టాయి. కారల్ మార్క్స్ 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో చెప్పిన ''ప్రపంచ కార్మికులారా ఐక్యం కండు'' ...నినాదంగా రూపొందింది. వర్గ పోరాట సిద్ధాంతాన్ని ప్రపంచం నలు మూలలకు వెదజల్లింది. వర్గ పోరాటాన్ని పదును పెట్టి దేశ పరిస్థితులకు అన్వయించి మన దేశంలో సోషలిజాన్ని సాధించడానికి కృషి చేయడమే నేటి మన మేడే కర్తవ్యం.
హే మార్కెట్ ఘటన 1886లో అమెరికన్ కార్మిక ఉద్యమం మీద ప్రగాఢ ప్రభావాన్ని చూపింది. అనేక సంవత్సరాల పాటు భీకర పోరాటాలు నడిపిన చికాగో కార్మిక ఉద్యమ నాయకత్వం నుంచే 'హే మార్కెట్' నేతలు పుట్టుకొచ్చారు. హే మార్కెట్ అమరవీరుల త్యాగ ఫలం కొనసాగింపుగా పెట్టుబడిదారీ విధాన పతనం ప్రారంభమైంది. పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మిక వర్గాన్ని మేడే ఏకతాటి పైకి తీసుకొచ్చింది. ''ప్రపంచ కార్మికులారా ఏకం కండు'' అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయడంలో మహత్తర శక్తిని ప్రదర్శించింది. సకల దేశాల్లోను పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన్ని తీవ్రతరం చేయడంలో కోట్లాది మంది కార్మికులకు మేడే ఈనాటికీ స్ఫూర్తిదాయకంగా వుంది. కాని పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగే వర్గ పోరాటాన్ని బలోపేతం చేసే చర్యలను చేపట్టకపోవడం వల్ల ఆచరణలో మేడే ఉద్దేశ్యమే వెనక్కి పోతున్నది. ఆచరణలో మేడే ను జరపడమంటే వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేసే సిద్ధాంతానికి కట్టుబడి ప్రతిజ్ఞ చేయడం.
హే మార్కెట్ ఘటనకు పూర్వం...
1880ల నాటికే ప్రపంచంలోనే త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న నగరంగా చికాగో నిలిచింది. న్యూయార్క్ కన్నా చికాగో లోనే కార్మికులు ఎక్కువగా వున్నారని 1887 లండన్ టైమ్స్ పత్రిక పేర్కొన్నది. 1855 నాటికి చికాగో లో స్థానికులకన్నా విదేశాల్లో పుట్టి వలసలు వచ్చినవారు ఎక్కువగా వుండేవారని చరిత్ర చెబుతున్నది. 1880 నాటికి నూతన యంత్రాల ప్రవేశంతో నిపుణులైన కార్మికుల సంఖ్య పెరిగింది. 8 గంటల పనిదినం ఉద్యమం ఫలితంగా 1867 మార్చిలో అమెరికా లోని ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ పనిదినాన్ని 8 గంటలకు తగ్గిస్తూ శాసనం చేసింది. 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి అనే శాస్త్రీయ విధానానికి ప్రభుత్వం తలవొగ్గక తప్పదు. అయితే ఈ శాసనం అమలు కాలేదు. దీంతో 8 గంటల పనిదినం కోసం కార్మికుల పోరాటాన్ని ఉధృతం చేయక తప్పలేదు. 1886 మే 1వ తేదీ నుంచి 8 గంటల పనిదినం ఉద్యమం ఉధృతమైంది. 1886 మేడే రోజున అమెరికాలో దేశవ్యాప్తంగా 12 వేల ఫ్యాక్టరీల్లో పని చేసే 3 లక్షల 40 వేల మంది కార్మికులు పనులు నిలిపివేశారు. వీరిలో 80 వేల మంది చికాగో లోనే వున్నారు. మే 2, 3 తేదీల్లో కూడా నిరసన ప్రదర్శనలు సాగాయి. మే 3వ తేదీ సాయంత్రం హే మార్కెట్ సభకు పెద్ద ఎత్తున శ్రామికులు హాజరయ్యారు.
హే మార్కెట్ ఘటన
హే మార్కెట్ దగ్గర 1886 మే 4వ తేదీన నిరసన సభ జరిగింది. పోలీసులు ఒక పథకం ప్రకారం సభపై దాడి చేశారు. కార్మికుల దుస్తుల్లో ఉన్న అనేక మంది పోలీసులు అక్కడే తిరుగుతున్నారు. బోన్‌ఫీల్డ్ పోలీసు అధికారి నాయకత్వంలో కార్మికులను చెదరగొట్టాల్సిందిగా ఆదేశించారు. బాంబు పేలిన మోత, తుపాకులు కాల్చిన శబ్దాలు ఒకేసారి మిన్నుముట్టాయి. బాంబు ఎవరు విసిరారు? అనేది నేటికీ అంతుపట్టని విషయం. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని మే 5వ తేదీన చికాగో లో మార్షల్ లా ప్రకటించారు. శాంతిభద్రతల వంకతో ఎలాంటి కారణాలు చూపకుండా చికాగో లో వందలాది కార్మికులను అరెస్టు చేశారు. సెర్చ్ వారెంట్లు లేకుండానే కార్మికుల ఇళ్ల లోకి, పత్రికా కార్యాలయాల్లోకి, సమావేశ మందిరాల్లోకి పోలీసులు చొరబడ్డారు. చరిత్రలోనే ఇదొక భయంకర కాలం. సోషలిజం అంటే ఏ మాత్రం తెలియని కార్మికులను చిత్ర హింసలకు గురిచేశారు. ''నిబే''పై ఆరోపణలను ఉపసంహరించాలని ప్రభుత్వ అటార్నీ సిఫార్సు చేశాడు. కాని న్యాయమూర్తి 15 ఏళ్ళ కఠిన శిక్షను విధించారు. దీనికి వ్యతిరేకంగా అమెరికా అంతటా కార్మిక సంఘాలు తీర్మానం చేసి సంతకాలు సేకరించాయి. కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపునిచ్చాయి. ఇంగ్లాండ్ లోని 49 నగరాల్లో కార్మికవర్గం ప్రదర్శనలు నిర్వహించారు. ''హే మార్కెట్ వీరులను ఉరితీయడం ద్వారా మా ఉద్యమాన్ని అణగదొక్కగలమని మీరు భావించినట్లయితే...మమ్మల్ని కూడా ఉరితీయండి. నిప్పు రవ్వను తొక్కిన ప్రతిచోట జ్వాలలు ఎగిసిపడతాయి. ఇది బడబాగ్ని. దీనిని మీరు ఆపలేరు'' అని 1887 అక్టోబర్ 22న ఒక ప్రదర్శనను ఉద్దేశించి బెర్నార్డ్‌షా తన ప్రసంగంలో పేర్కొన్నాడు. బ్రిటన్‌లో కార్మికుల స్పందన చూసి దేశాధ్యక్షుడు బిస్మార్క్ కు ఆందోళన కలిగింది. బహిరంగ సభలపై నిషేధం విధించాడు. ఉరిశిక్షలు రాజకీయ నేరమంటూ ప్రాన్స్‌లో 1887 అక్టోబర్ 29న నిరసనలు తెలిపారు. హే మార్కెట్ విచారణ ఒక బూటకంగా సాగింది. చికాగో న్యాయమూర్తుల్లో ఉదారవాదిగా పేరొందిన ''తులే'' ఈ కేసును విచారించాలి. కాని ఈ కేసును కరుడుగట్టిన న్యాయమూర్తి 'గారే' కి అప్పగించారు. ఈ కేసులో ''ఆస్కార్ నిబే'' ను మినహాయించి నలుగురు ముద్దాయిలైన స్పైస్, ఏంజల్, పార్సన్స్, ఫిషర్‌లను 1887 నవంబర్ 11వ తేదీన ఉరితీశారు. ఉరిశిక్షకు గురైన వారిని బంధువులకు కూడా చూపలేదు.
8 గంటల పని దినం: ప్రపంచ వ్యాప్త పోరాటాలు
1890 మే 1వ తేదీన సెయింట్ లూయిస్ లో నిర్వహించిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ సదస్సులో 8 గంటల పని దినం, సుస్థిర శాంతి సమర నినాదాలుగా మారాయి. 1889 జులై 14న పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభ మేడే ని అంతర్జాతీయ శ్రామిక దినంగా గుర్తించాలని నిర్ణయించింది. 1905లో రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ లోని రాజభవనం (వింటర్ ప్యాలెస్) దగ్గర రష్యన్ కార్మికులు గుమిగూడారు. వీరి మీద రష్యన్ సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్త్రీలు, పురుషులు, పిల్లలను చావబాదారు. మేడే సెయింట్ పీటర్స్‌బర్గ్ అమరవీరుల స్మారక దినంగా మారింది. 1917లో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు 8 గంటల ఆందోళనలకు దిగారు. ''8 గంటల కంటే నేను పని చేయను'' అనే నినాదం మిన్నుముట్టింది. ఇటలీ లో మేడే నాడు శ్రామికులపై పోలీసు కాల్పులు జరిగాయి. మేడే నిరసన ప్రదర్శనల ప్రభావం అడాల్ఫ్ హిట్లర్‌పై పడింది. 1933లో హిట్లర్ సైతం మేడే ప్రదర్శకుల డిమాండ్లను సమర్ధించాడు. ప్రపంచవాప్తంగా సాగిన పోరాటాలతోనే 8 గంటల పని అమలు లోకి వచ్చింది.
పెట్టుబడిదారీ విధానంపై జరిగిన మొదటి తిరుగుబాటు మేడే. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మేడే నిరసనలు, కార్మిక వర్గ ఉద్యమాలు వర్గ పోరాట సిద్ధాంతాన్ని పదును పెట్టాయి. కారల్ మార్క్స్ 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో చెప్పిన ''ప్రపంచ కార్మికులారా ఐక్యం కండు''... ఓ నినాదంగా రూపొందింది. వర్గ పోరాట సిద్ధాంతాన్ని ప్రపంచం నలు మూలలకు వెదజల్లింది. వర్గ పోరాటాన్ని పదును పెట్టి దేశ పరిస్థితులకు అన్వయించి మన దేశంలో సోషలిజాన్ని సాధించడానికి కృషి చేయడమే నేటి మన మేడే కర్తవ్యం.
సిహెచ్. నరసింగరావు
/ వ్యాసకర్త : సిఐటియు ఎ.పి రాష్ట్ర అధ్యక్షులు /