Apr 28,2023 21:41

ప్రజాశక్తి - కామవరపుకోట
             కార్మికుల దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు మండల టౌన్‌ కమిటీల సమావేశం షేక్‌ సుభాషిని అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ కార్మికుల దినోత్సవం మే డే ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాటం చేసి 16 గంటల పని దినాన్ని ఎనిమిది గంటల పని దినంగా సాధించుకున్న మొదటి విజయంగా ఈ మేడే చెప్పవచ్చని ఆయన తెలిపారు. మేడే సందర్భంగా కామవరపురకోట పట్టణంలో, గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని, భారీ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు.
మండవల్లి : కార్మికుడు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని పోరాడి సాధించుకున్న ఫలితమే మేడే అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు విజయలక్ష్మి స్పష్టం చేశారు. స్థానిక శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం మేడే పోస్టర్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారన్నారు. సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని నిరూపించబడిందన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారన్నారు. అప్పటి నుంచి ప్రపంచమంతా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం మేడే వారోత్సవాలు జెండా ఆవిష్కరణతో ప్రారభించి ఊరేగింపులు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చెల్లమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం లీడర్స్‌ వాణి, ఉమాదేవి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
చింతలపూడి : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిఐటియు మండల నాయకులు శుక్రవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులను కుదించివేస్తున్న నేటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నాయని, పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాలకు నిరసన తెలియజేస్తున్నాయని తెలిపారు. అనేక పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడానికి బెజెపి కంకణం కట్టుకుందన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలు ఆర్జించి పెట్టడానికి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. మేడేను స్ఫూర్తిగా తీసుకొని కార్మిక వర్గం ఒక్కటై మేడే ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌డి.జఫ్రుల్లా, సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటే శ్వరరావు, ప్రధాన కార్యదర్శి, ఎం.బాలరాజు, అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.సరోజిని, టి.మాణిక్యం, అరుణ, కవిత, సరళ, పద్మ ,ఆశ వర్కర్స్‌, యూనియన్‌ మండల కార్యదర్శి సరళ కుమారి పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు జి.రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆగిరిపల్లిలోని సిఐటియు కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్తు కోటేశ్వరరావు, చాకిరి శివనాగరాజు, షేక్‌ జహాంగీర్‌ బాషా, ఏపూరి రవీంద్ర, బండి కోటేశ్వరరావు పాల్గొన్నారు.