ప్రజాశక్తి-పాడేరు:పిల్లలకు బలమైన ఆహరం అందించటానికి విటమిన్లు, ఐరన్ కలిపి తయారు చేసిన ఫోర్టిపైడ్ బియ్యం రేషన్ డిపోల్లో ప్రతి కిలోకు 50 గ్రాములు అందిస్తున్నామని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజరు ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. ఐసిడిఎస్, పౌర సరఫరాలు, విద్య, గిరిజన సంక్షేమ శాఖాదికారులతో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వ హించారు. గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించిన కమిషన్ చైర్మన్ అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, పాడేరు మండలాలలోని 30 కేంద్రాలు (ఎం.ఎల్.ఎస్ పాయింట్లు, చౌక దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, సంచార పంపిణీ వాహనాలు, పాఠశాలలు, వసతి గృహాలు) సందర్శించి లోటుపాట్లను గుర్తించి తగు సూచనలు జారీ చేసారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది మే నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ దిశగా అందరూ పని చేయాలని స్పష్టం చేశారు. నాణ్యతా లేమిని సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. అంగన్వాడి వర్కర్ల నిరక్షరాస్యతతో కొన్ని కేంద్రాలలో తగు న్యాయం జరగలేనట్లు గుర్తించామని, అటువంటి కేంద్రాలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. హాజరు నమోదులో, నాణ్యతలో రాజీ లేకుండా ఖచ్చితమైన కొలతలతో ఆహారాన్ని పెట్టాలని ఆదేశించారు. ఆహార వస్తువులు, గుడ్లు, పప్పులు, నూనేలపై గడువు తేదీ పరిశీలించాలని కోరారు. సిడిపిఓలు క్రమం తప్పకుండా కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఫోర్టిపైడ్ బియ్యంపై అవగాహన కల్పించాలని చైర్మన్ ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని అంగన్వాడి, విద్యా సంస్థలతో పాటు ఏడు జిల్లాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఆహార పంపిణీలో నాణ్యత, పరిమాణంలో తేడాలు ఉంటే ఫోన్:9490551117 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలనలో గుర్తించిన లోపాలను సరి చేస్తామన్నారు. జిల్లాలో భౌగోళికంగా ప్రత్యెక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ నాణ్యమైన సేవలు అందించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చైర్మన్ కు తెలిపారు.
జేసి శివ శ్రీనివాసు మాట్లాడుతూ, పౌర సరఫరాలు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం అమలు పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు. సంచార పంపిణీ వాహనాలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని, సిగల్ సమస్య కూడా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్, పౌర సరఫరాల ఉప సంచాలకులు సురేష్, జిల్లా పౌర సరఫరా అధికారి శివ ప్రసాద్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, డిఎంహెచ్‌ఓ సుజాత, ఎటిడబ్ల్యుఓ ఎల్.రజని, సిడిపిఓలు, ఎంఇఓలు, తదితరులు పాల్గొన్నారు.










