May 02,2023 19:29

చిప్పగిరిలో జెండాను ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
మే డే స్ఫూర్తితో ఐక్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని సిఐటియు డివిజన్‌ నాయకులు కెపి.నారాయణస్వామి కోరారు. మంగళవారం చిప్పగిరిలో నారాయణస్వామి ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవ వేడుకలను రెండో రోజు నిర్వహించారు. ఆశా కార్యకర్తలు, స్వచ్ఛ భారత్‌ కార్మికుల సమక్షంలో ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులు కార్మికులను మనుషులుగా చూడకుండా 14 నుంచి 18 గంటల వరకు పని చేయించుకుని లాభాలను దోచుకునే వారన్నారు. 1886 అమెరికా దేశం చికాగో నగరం మార్కెట్‌ దగ్గర జరిగిన పోరాటాన్ని అణిచివేయడానికి పెట్టుబడిదారి పాలకవర్గం కార్మికులపై నిర్ధాక్షణ్యంగా కాలుపులు జరిపి ప్రాణాలు తీసిందని తెలిపార. ఆ రక్తం నుంచి వచ్చిన జెండానే ఎర్రజెండాగా మారి కార్మికుల విప్లవ కెరటం అయిందన్నారు. ఆ స్ఫూర్తితోనే 8 గంటల పని విధానాన్ని సాధించిందన్నారు. సిఐటియు మండల నాయకులు ఈరన్న, స్వచ్ఛ భారత్‌ కార్మికులు గోవిందు, గోవిందప్ప, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.