మే 31న సిద్దేశ్వర అలుగు ప్రజా జాగరణ దీక్ష
- బొజ్జా దశరథరామిరెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల
చట్టబద్ద నీటి హక్కుల కోసం రాయలసీమలో ఉద్యమ స్పూర్తిని రగిల్చిన సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 7వ వార్షికోత్సవం సందర్భంగా మే 31 రాత్రి 7 గంటల నుండి జూన్ 1 ఉదయం 10 గంటల వరకు సిద్దేశ్వరం అలుగు ప్రజా జాగరణ దీక్ష చేపడుతున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. గురువారం నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా రూల్ కర్వ్‌ను సిద్దేశ్వరం ప్రజా అలుగు శంకుస్థాపన స్ఫూర్తితో సాధించామని తెలిపారు. ఉద్యమాలతో సాధించిన హక్కుల అమలు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న పాలకుల, వాటి అమలుకు పట్టుపట్టని ప్రతి పక్ష రాజకీయ పార్టీల వైఖరిని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు. సిద్దేశ్వరం అలుగు ప్రజా జాగరణ దీక్షను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, సౌదాగర్ ఖాసిం మియా, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.










