Jun 12,2023 18:01

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఆదోనికి మెడికల్‌ కళాశాల రావడం అభివృద్ధి కాదా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆదోని మండలం విరుపాపురం గ్రామ శివారులో నాబార్డు నిధులు రూ.7.65 కోట్లతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను సోమవారం ప్రారంభించారు. కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన, కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌, జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తవడం, నేడు ప్రారంభించుకోవడం గొప్ప విషయమని చెప్పారు. కోట్లాది రూపాయలతో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల నిర్మించడం, వసతులు మెరుగుపరచడం వంటివి అభివృద్ధిలో భాగం కాదా అని ప్రశ్నించారు. మరుగుదొడ్లు, తాగునీళ్లు లేని పాఠశాలలు సహా మొత్తం 40 వేల పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దామని తెలిపారు. జిఐఎస్‌ సమ్మిట్‌ సాక్షిగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చామని ప్రకటించడం ప్రతిపక్షం చూడకపోయినా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యంతో యువత సన్నద్ధం కావడానికి, డిజైన్‌ చేయడానికి ఇంజినీరింగ్‌, తయారీ రంగంలో పాలిటెక్నిక్‌, మానవవనరులు ప్రధానంగా ఐటిఐలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో పోటీపడే విధంగా ఎప్పటికప్పుడు కరికులమ్‌ను సిద్ధం చేస్తున్నామని, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ అనంతరం వెంటనే ఉపాధి అవకాశాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం డిఎంఎఫ్‌ నిధులు ఉపయోగించకునే వీలు కల్పిస్తామన్నారు. చిన్నతనం నుంచి రాజకీయంలో ఉంటూ తన నియోజకవర్గం కోసం చురుగ్గా పని చేసే ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అని, ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంపిడిఒ గీతావాణి, జడ్‌పిటిసి ఆనంద్‌, విరుపాపురం సర్పంచి ప్రహ్లాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు.