Dec 18,2022 22:46

పునాది దశ దాటని భవనాల నిర్మాణం
2023లో 150 సీట్ల కేటాయింపు
ఈ నెలలోనే ఎన్‌ఎంసి బృందం ఇన్‌స్పెక్షన్‌
ఆ బృందం అనుమతిస్తేనే తరగతులు ప్రారంభం
భవనాల నిర్మాణంపై నీలినీడలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

               ఏలూరు మెడికల్‌ కాలేజీ భవనాల నిర్మాణం ఈ ఏడాది పూర్తయ్యేనా.. అనుకున్న ప్రణాళిక ప్రకారం 2023లో తరగతులు ప్రారంభమయ్యేనా.. జిల్లావాసులు ఎదురుచూస్తున్న ఏళ్లనాటి మెడికల్‌ కాలేజీ కల నెరవేరేనా అంటే ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది మెడికల్‌ కాలేజీ తరగతులు ప్రారంభిస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ భవనాల నిర్మాణం పునాదుల దశను దాటలేదు. దీంతో వచ్చే ఏడాది మెడికల్‌ కాలేజీ ప్రారంభంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. టిడిపి ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకూ ఏలూరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై శంకుస్థాపనల పర్వం సాగడమే తప్ప కాలేజీ మాత్రం ప్రారంభంకాలేదు. ఈ ఏడాది కచ్చితంగా క్లాసులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం, అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. ఏలూరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.525 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పింది. భవనాల నిర్మాణానికి సంబంధించి ఏలూరులోని జిలా ప్రభుత్వాసుపత్రిలోని స్థలాన్ని తొలుత ఎంపిక చేశారు. తర్వాత బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మళ్లీ ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించి చిట్టచివరికి ఏలూరు పాతబస్టాండ్‌ సమీపంలోని డిఎంహెచ్‌ఒ కార్యాలయ ప్రాంగణంలో కాలేజీ భవన నిర్మాణానికి పూనుకున్నారు. వచ్చే ఏడాది మే మొదటి వారంలో జాతీయ స్థాయిలో మెడిసిన్‌కు సంబంధించిన నీట్‌ పరీక్ష జరగనుంది. ఫలితాల అనంతరం 2023 ఆగస్టులో మెడికల్‌ సీట్లు కేటాయించనున్నారు. ఏలూరు మెడికల్‌ కాలేజీకి తొలిఏడాది 150 సీట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంత వరకూ బాగానే ఉంది. విద్యార్థులకు సీట్లు కేటాయిస్తే తరగతులు ఎక్కడ నిర్వహిస్తారనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ మెడికల్‌ కాలేజీ భవనాల నిర్మాణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎన్‌ఎంసి బృందం అనుమతిస్తేనే తరగతులు
మెడికల్‌ కళాశాల తరగతులు ప్రారంభం కావాలంటే నేషనల్‌ మెడికల్‌ కౌన్సెల్‌ అనుమతి తప్పనిసరి. ఈ ఏడాది నుంచి మెడికల్‌ కాలేజీ ప్రారంభానికి అనుమతి ఇవ్వాలంటే ఎన్‌ఎంసి బృందం ఇన్‌స్పెక్షన్‌ పూర్తికావాల్సి ఉంది. ఈ నెలలోనే ఈ బృందం వచ్చి ఇన్‌స్పెక్షన్‌ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్‌ఎంసి బృందాన్ని మెప్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్‌ కాలేజీకి సంబంధించిన సిబ్బంది నియామకం పూర్తయినట్లు చెబుతున్నారు. ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్ల నియమాకం పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా బోధనా ఆసుపత్రిగా మారనున్న ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోనూ పలు మార్పులు చేశారు. కానీ అత్యంత కీలకమైన తరగతి గదుల భవనాలు మాత్రం పునాదులు దాటలేదు. దీంతో ఎన్‌ఎంసి బృందం సంతృప్తి చెందుతుందా.. లేక అసంతృప్తి వ్యక్తంచేస్తుందా అన్న అనుమానం నెలకొంది. ఈ ఏడాది తరగతులు ఖచ్చితంగా ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇన్‌స్పెక్షన్‌ జరిగే వరకూ టెన్షన్‌ తప్పదని చెప్పొచ్చు.