ప్రొద్దుటూరు : జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్ మధ్యతరగతి కుటుంబీకులు సొంతింటికలను నెరవేర్చుకునేందుకు మంచి అవకాశమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. అన్నమయ్య అర్బన్‌డెవెలప్‌మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొర్రపాడురోడ్డులోని ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని అనుమతులతో కూడిన 45 ఎకరాలు భూమిని సేకరించామన్నారు. ఇందులో 25 ఎకరాలు ఇళ్లకు, మిగిలిన 40 ఎకరాలు మౌలిక వసతులకు కేటాయించామని చెప్పారు. రూ.29కోట్లతో టెండర్‌లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు రూ.8ల క్షలకు పైబడి ఉందని, ప్రభుత్వం కేవలం రూ.5 లక్షలకే అమ్మకానికి పెట్టిందన్నారు. ఈ అభివృద్దిలో టిడిపి వారిని కూడా అహ్వానిస్తున్నామన్నారు. ఆయా పట్టణాలలో వ్యాపారం చేసి వచ్చిన లాభాన్ని పట్టణాభివృద్ధికి వెచ్చించేలా ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ విధానం ద్వారా ప్రొద్దుటూరును బృందావనంగా తయారుచేస్తామన్నారు. అధారిటీ ఛైర్మెన్ గురుమోహన్ మాట్లాడుతూ ప్లాటు విస్తీర్ణం 3,4,5 సెంట్లుగా ఉంటుందని దరఖాస్తుతో పాటు మొత్తం ప్లాటు విలువలో 10 శాతం చెల్లించి ప్రతి మూడు నెలలకు 30 శాతం చొప్పున సంవత్సరం లోపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అగ్రిమెంట్ తేదీ నుండి మొత్తం విలువ ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. ఈ విధానం ద్వార మద్యతరగతి కుటుంబీకులు అన్ని సౌకర్యాలతో కూడిన సొంతింటికలను సాకారం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం బ్రోచర్‌ను విడుదల చేశారు. సమావేశంలో కమిషనర్ వెంకటరమణయ్య పాల్గొన్నారు.










