మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం
- నిర్వాహకులపై జిల్లా అబ్జర్వర్ ఆగ్రహం
ప్రజాశక్తి - పగిడ్యాల
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతలేక పోవడంతో నిర్వాహకులపై జిల్లా అబ్జర్వర్ విజయకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని నాడు-నేడు, జగనన్న కాలనీలను, పాఠశాలల్లో మధ్యాహ్న బోజన పథకాన్ని ఆమె తనిఖీ చెశారు. ముందుగా మండలంలోని నెహ్రునగర్ ప్రాథమిక పాఠశాల, లక్ష్మాపురం ఎంపియుపి పాఠశాల, ప్రాతకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఘణపురం గ్రామాల్లో నాడు-నేడు పనులు, జగనన్న కాలనీలను, మధ్యాహ్న బోజన పథకాన్ని పరిశీలించారు. జగనన్న కాలనీలలో పూర్తి చేసిన ఇండ్లకు ఎంత మంజురైనవి, ఇంటికి ఎంత ఖర్చు వచ్చిందని లభ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాడు-నేడు పనులను పరిశీలించారు. ప్రాతకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి లేదని, నాణ్యత లేదని మండిపడ్డారు. విద్యార్థుల హాజరు శాతానికి, వండిన భోజనానికి వత్యాసం కనిపించడంతో అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని త్రిసభ్య కమిటీ సభ్యులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వెంకటరమణ. ఎంఇఒ సుభాన్, హౌసింగ్ ఎఇ జ్యోతి, అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.










