Feb 22,2023 22:09

ప్రజాశక్తి - కుక్కునూరు
         మధ్యాహ్నం భోజన కార్మికుల మెనూ ఛార్జీలు పెంచి ప్రమాద బీమా అమలు చేయాలని మధ్యాహ్నం భోజన కార్మికుల యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి మోడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం యూనియన్‌ సమావేశం గంగమ్మ అధ్యక్షతన సుందరయ్య భవనం ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, అహర్నిశలు కృషి చేస్తున్న మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి రాగి ముద్ద తప్పనిసరిగా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, కానీ దానికి సంబంధించి పిండి ప్రభుత్వం సరఫరా చేస్తుందా, లేక మెనూ ఛార్జి పెంచుతుందా అన్ని విషయం చెప్పలేదన్నారు. అలాగే కొత్త మెనూ చాలా కష్టంగా మారుతుందని, అలాగే స్కూల్‌ మెర్జ్‌ పేరుతో చాలా మంది కార్మికులను ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. హై స్కూల్లో 9, 10 పిల్లలకు వంట చేస్తున్న కార్మికులకు కనీస వేతనం కూడా లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటూ కొత్త కొత్త మెనూలు అమలు చేస్తుందన్నారు. వంటకు సరిపడు వర్కర్స్‌ గానీ, వంట పాత్రలు గానీ, గ్యాస్‌ సదుపాయం గానీ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రమాద బీమా అమలు చేయాలని, మార్కెట్‌ రేటుకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, గుర్తింపు కార్డులు, కాటన్‌ యూనిఫారాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, ప్రతీ సంవత్సరం వర్కర్స్‌ని మార్చకుండా ఒక్కరినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు కుక్కునూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు కుంజ నాగలక్ష్మి, యర్నం సాయికిరణ్‌, కార్మికులు పుష్ప, చిట్టెమ్మ, గంగమ్మ, ఉమ, దుర్గమ్మ పాల్గొన్నారు.