Aug 08,2023 20:55

మధ్యాహ్న భోజనానికి ధరల మంట

ఎర్రగుంట్ల : మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల భారం పడింది. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు వంట వండి వండించడానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ముందు నుంచి అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని వైసిపి ప్రభుత్వం వచ్చాక 'జగనన్న గోరుముద్ద' గా నామకరణం చేశారు. అప్పటి నుంచి మెనూలో మార్పులు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ నిర్దేశించిన మెనూ ప్రకారం వంటలు వండి పెట్టడానికి పథకం కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా తమ వేతనం నుంచి ఖర్చు చేసి మరీ విద్యార్థులకు రుచికరమైన భోజనం వండిపెడుతున్నారు. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలో 13 ప్రాథమిక పాఠశాలలు, ఒక్క ప్రాథమికోన్నత పాఠశాల, 3 ఉన్నత పాఠశాలలున్నాయి. ఉండగా అందులో ఒకటి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులు 886 మంది, 6 నుండి 10వ తరగతి చదివే పిల్లలు 1184 మంది ఉన్నారు. రూరల్‌ పరిధిలో 29 ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 2 ఉన్నత పాఠశాలలో ఉండగా అందులో ఒకటి నుండి 5వ తరగతి వరకు చదివే పిల్లలు 902 మంది, 6 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 972 మంది ఉన్నారు. మండల వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులకు ఆయా పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వండి వడ్డిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఒక్కో విద్యార్థికి రూ.5.88, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.8.57 చొప్పున ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుండి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. కూరగాయల పలావ్‌, వెజిటేబుల్‌ బిర్యాని, కుర్మా, సాంబార్‌ బాత్‌, ఆకుకూరల పప్పు వంటి పలు రకాల వంటకాలు వండాలని చెబుతున్నారే కానీ వాటికయ్యే ఖర్చులు మాత్రం ప్రభుత్వం పెంచడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం బియ్యం, గుడ్లు, చిక్కీలు, రాగి పిండి, బెల్లం మాత్రమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, నూనె, కందిపప్పు, గ్యాస్‌ తదితర సరుకులను ప్రభుత్వం ఇస్తున్న తక్కువ ఛార్జీలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు రూ.1200, నూనె లీటరు రూ.160, టమోటాలు కిలో రూ.150, పచ్చిమిర్చి కేజీ రూ.120 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నిత్యావసర సరుకు ధర పెరిగిందని, తమపై అదనంగా భారం పడుతోందని, దీంతో ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వంట చార్జీలు సరిపోక కార్మికులకు వస్తున్న రూ. 3 వేల జీతాలు కూడా వెచ్చించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని కార్మికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు అప్పులు చేస్తూ కూడా పథకాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులను గ్రహించి వంట చార్జీలను పెంచాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పెరిగిన ధరలతో నిర్వహణ కష్టం
కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీ తంగా పెరగడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టంగా మారింది. మాకు వచ్చే జీతాలు సైతం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే ధరలలోనే మూడు రోజులు రాగి జావా, ఐదు రోజులు గుడ్లు వండి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆర్థిక ఇబ్బందులను గమనించి ప్రభుత్వం వంట ఛార్జీలు పెంచాలి.
- వెంకట రమణమ్మ, మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు, ఎర్రగుంట్ల.
ఒక్కో విద్యార్థికి రూ.15 - 20 చెల్లించాలి
ఒక్క పూట భోజనానికి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికీ రూ.5.88 నుండి రూ.8.57 మాత్రమే ఇస్తోంది. అది వంట కార్మికులకు ఏమాత్రం సరిపోదు. ప్రభుత్వం దీనిపై చర్చించి ఒక్కో విద్యార్థికి రూ.15 నుండి రూ.20 చెల్లించాలి. అలాగే వంట కార్మికులు చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు కూడా పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- బి. మనోహర్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.