Jul 31,2023 22:48

ధర్నా చేస్తున్న ఎండిఎం కార్మికులు

- కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలి
- ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి
- కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి విరుద్ధంగా పథకానికి, వంట కార్మికులకు కావాల్సిన నిధులను కేటాయించకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ కె.నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు విమర్శించారు. మధ్యాహ్న భోజనం పథకానికి బడ్జెట్‌, వర్కర్లకు వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని, ఉపాధి భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ఆధ్వర్యాన వంట కార్మికులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. నగరంలోని వాంబే కాలనీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంపుదల లేకపోగా 2013-14 సంవత్సరంలో రూ.13,215 కోట్లు కేటాయిస్తే 2022 -2023 బడ్జెట్‌లో రూ.10,234 కోట్లకు తగ్గించిందని తెలిపారు. 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించకుండా, పనిచేయించుకుంటోందని విమర్శించారు. రోజుకు 6,7 గంటలు శ్రమ చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడి పోరాడితే రూ.మూడు వేల గౌరవ వేతనం ఇస్తున్నారన్నారు. వాటిని కూడా సకాలంలో చెల్లించకుండా నెలల తరబడి బకాయిలు ఉంటున్నాయన్నారు. ఏడాదికి పది నెలలకే వేతనం ఇస్తున్నారని, విద్యార్థుల సంఖ్య తగ్గిందని కొన్ని సూళ్లలో కార్మికులకు గౌరవ వేతనాలు చెలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.పది వేలుతో పాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలల విలీనం వల్ల అనేక చోట్ల పాఠశాలలు మూతపడ్డాయని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకం అమలుపై గొప్పగా ప్రకటనలు ఇస్తున్నా, దానికి తగ్గ నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఒక విద్యార్థికి ప్రభుత్వం కేటాయించే రూ.7కు టీ కూడా రావడం లేదని, ఆ మొత్తంతో పౌష్టికాహారం వండి పెట్టమంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ఒక విద్యార్థికి రూ.20 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించారని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం జెడ్‌పిలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి, భూదేవి పాత్రో, ఎ.కళావతి, టి.సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.