జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి పాడేరు : ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పడితే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. విద్యార్థులకు పెట్టవలసిన ఆహార పదార్థాలు బయట వ్యక్తులకు పెడితే ఉపేక్షించనన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు నియోజక వర్గానికి సంబంధించి ఐదు మండలాల సహాయ గిరిజన సంక్షేమాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో చేయకూడని పనులు, చేయవలసిన పనులపై ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ జారీ చేయాలని ఎంఇఒలను, ఎటిడబ్ల్యూఒలను ఆదేశించారు. అధికారులు పాఠశాలల స్టోర్ రూంలను తనిఖీ చేయాలన్నారు. కాలం చెల్లిన నిత్యావసర సరుకులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలన్నారు. విద్యార్థులను ఇళ్ళకు తీసుకుని వెళ్లే తలిదండ్రులు నుంచి తామే బాధ్యత వహిస్తామని లేఖ తీసుకుని పిల్లలను పంపించాలని స్పష్టం చేసారు. పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక ఇంక్రిమెంట్ కట్ చేయాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలలో బినామి వ్యక్తులతో పనులు చేయిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి అధికారులపై మూడవ వ్యక్తి ప్రభావం ఉండకూదని, తప్పులు చేసిన తర్వాత సిఫార్సులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్న విద్యాకానుక కిట్లు పంపిణీపై ఆరా తీసారు.
మన బడి, నాడు నేడు పనుల్లో జాప్యం వద్దు
మన బడి నాడు నేడు రెండవ దశ పనులలో జాప్యం చేయకుండా పనుల చేయాలని ఆదేశించారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో సంబంధం లేకుండా స్థానిక ధరలకు నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. పాడేరు నియోజకవర్గంలో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. చింతపల్లి మండలంలో రూ.80 లక్షలు, జికె.వీధిలో రూ.55 లక్షలు, కొయ్యూరు రూ.21 లక్షలు, జి.మాడుగులలో రూ.1 కోటి నిధులు ఖర్చు చేయాల్సి ఉందని, రానున్న 15 రోజుల్లో వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీరు మరుగుదొడ్లు, వంటగదులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిఇఒ డా.పి.రమేష్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, ఇఇ విఆర్‌ఎం రాజు, డిఇ . అనుదీప్ పాల్గొన్నారు.
నాణ్యతగా తాగునీటి పథకాల నిర్మాణం
తాగునీటి పథకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తాగునీటి పథకాల నిర్మాణాలలో ఎక్కడా సబ్ కాంట్రాక్టర్ ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయకపోతే మళ్లీ టెండర్ పిలుస్తామన్నారు. మంజూరు చేసిన పనులు వారం రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. పనులపై డిఇలు, ఎఇలకు అవగాహన ఉండాలని చేపట్టిన పనుల మేరకు ఎప్పటికప్పుడు బిల్లులు ఆప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ లీలాకృష్ణ పాల్గొన్నారు.










