ప్రజాశక్తి-తెనాలి, చేబ్రోలు : రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యులు జి.దేవి బుధవారం తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో, మండలంలోని పెదరావూరు జెడ్‌పి పాఠశాలలో, చేబ్రోలు మండలం నారాకోడూరు జెడ్‌పి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గిరిజిన గురుకుల పాఠశాలకు చేరుకున్న ఆమె మెనూ అమలు తీరు, సరకుల నిల్వ, తదితరాలను పరిశీలించారు. భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యంలో ఏమైనా తేడా ఉంటే వాటిని ఉపయోగించవద్దన్నారు. అక్కడి నుంచి పెదరావూరు జెడ్‌పి పాఠశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. అధిక శాతం విద్యార్థులు ఇంటి నుంచి భోజనాన్ని తెచ్చుకోవటాన్ని గమనించిన అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిదనే ఆరోపణలున్నాయని, దీనిపై హెచ్‌ఎం శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. నారాకోడూరు జెడ్‌పి పాఠశాలకు వెళ్లిన దేవి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం తయారీ, రికార్డులను తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులు పఠనా శక్తిని పరిశీలించి విద్యార్థుల రీడింగ్ నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ట్యాబుల వినియోగంపై సూచనలు చేశారు. ఎన్‌సిసిలో నైపుణ్యం ప్రదర్శించిన కేడెట్లకు 'ఎ' సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఓ విద్యార్థిని చిత్రలేఖ ప్రదర్శన నైపుణ్యాన్ని అభినందించారు. కార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి కె.పద్మ, ఎస్‌డబ్ల్యూవో జి.శైలజ. అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ వి.భిక్షాలు, తెనాలి ఎంఇఒ డాక్టర్ ఎం.లక్ష్మినారాయణ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బండి విజయకుమార్, నారాకోడూరు జెడ్‌పి పాఠశాల హెచ్‌ఎం ఎం.ఏడుకొండలు తెనాలి డివైఇఒ ఎం.నిర్మల, గుంటూరు డివైఇఒ వెంకటేశ్వరరావు, చేబ్రోలు ఎంఇఒ ఆర్.సుబ్బారావు పాల్గొన్నారు.










