ప్రజాశక్తి-పాడేరు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తక్కువ వేతనాలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ దుయ్యబట్టారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ఐటీడీఏ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులు అతి తక్కువ జీతాలతో పని చేస్తున్నారని, బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి పెట్టుబడులు లేక, చేసిన అప్పులు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కార్మికులకు ఇచ్చే జీతం రెండు వేలతో నెల అంతా ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పనికి తగిన వేతనాలు అందక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో బడి పిల్లలకు భోజనం వండి పెట్టేందుకు ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేసి, ఒక పిల్లవాడికి భోజన నిమిత్తం రోజు కు ఇచ్చే 6 రూపాయల 85 పైసల సొమ్ము చాలలేదని, రోజుకు 20 రూపాయలు చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ ఇంట్లో బియ్యం తీసుకొచ్చి పిల్లలకు వండి పెడుతున్నారని తెలిపారు.
గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల దేవ్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం అరకొర వేతనాలు ఇస్తోందని ఇవి కూడా సకాలంలో చెల్లించలేదని విమర్శించారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు బడ్జెట్ పెంచాలని అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేసి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు, తమ్మర్బ అప్పలకొండ పడాల్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్ సుందర్రావు, మధ్యాహ్న భోజనం కార్మికుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పసుపులేటి లక్ష్మి, సోమ్ దేవి, కాంతమ్మ, శాంతి కుమారి, పద్మ, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు సబ్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.శాంతిరాజు ఆధ్వర్యంలో రంపచోడవరం యూనియన్ జిల్లా కార్యాలయం నుండి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఆందోళన చేపట్టారు. తమస సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, భోజన కార్మికుల నాయకులు కె.మంగమ్మ, పద్మ, బాపనమ్మ, అన్న పూర్ణ, టి.కుమారి, ఏడుమండలాల భోజన కార్మికులు పాల్గొన్నారు.










