ప్రజాశక్తి-అనకాపల్లి
మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం, అధికారులు వేధింపులు ఆపాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం జరిగిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె తమాట్లాడుతూ మెనూల పేరుతో ఒత్తిడి తేవడంతో కార్మికుల ప్రమాదాలకు, అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 గంటలకు విద్యార్థుల లెక్క ఇచ్చి 12.30 గంటలకు భోజనాలు తయారు చేయడమంటే ఎంతో ప్రయాసతో కూడుకుందని వాపోయారు. ఒక్కో పాఠశాలలో 500 మంది నుంచి 4 వేల మంది వరకు విద్యార్థులున్నారని, కేవలం రెండున్నర గంటల్లో వంట తయారు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాకుళం జిల్లా ములియాపుట్టు మండలం జూడుపల్లి కార్మికురాలు వంట చేస్తూ కాలిపోయి, కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
మార్చి ఒకటి నుంచి ఉదయం 9 గంటలకు రాగి మాల్ట్ పెట్టాలని కొత్త మెనూ తెస్తున్నారని, వర్కర్లను పెంచకుండా, కేవలం రూ.3వేలు వేతనం ఇచ్చి పని ఒత్తిడి విపరీతంగా పెంచడం దారుణమన్నారు. ఇన్ని వంటలను చేయమని చెబుతున్న ప్రభుత్వం వంట పాత్రలు, గ్యాస్ సదుపాయం, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఈఎస్‌ఐ, చనిపోయిన వారికి నష్టపరిహారం వంటివి కల్పించడం లేదని తెలిపారు. ప్రభుత్వం కార్మికులను పొమ్మనకుండా పొగబెట్టినట్టు తీవ్ర ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నారు. పని భారం తగ్గించి, వేతనాలు పెంచాలని, అన్ని వసతులు కల్పించాలని, చనిపోయిన కార్మికురాలికి నష్టపరిహారం ఇవ్వాలని, 9, 10 తరగతి తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు రమణమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










