మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - సిఐటియు
ప్రజాశక్తి - నంద్యాల
మధ్యాహ్న భోజన కార్మికుల నంద్యాల జిల్లా సమావేశము బుధవారం యూనియన్ జిల్లా నాయకురాలు ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ నాగరాజు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కేఎంబి గౌస్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయని వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్కూళ్లలో పనిచేస్తున్నారని వారి పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారి శ్రమ శక్తిని దోచుకుంటున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని వంట పాత్రలు ప్రభుత్వము ఇవ్వాలని అన్నారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో గ్యాస్ సొంతంగా కొని మధ్యాహ్నం భోజనం వారికి వచ్చే అతి తక్కువ వేత నాలతో గ్యాస్ పై ఖర్చు పెడుతున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. నేటికీ మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు ఉన్నాయని వాటిని అరికట్టాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో శకుంతల,మేరీ,పుష్పావతి, మహమ్మద్ బి, మార్తమ్మ, గ్రేసమ్మ, నాగమ్మ,చెంచమ్మ, అనితమ్మ, నాగలక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.










