Mar 09,2023 23:44

మాట్లాడుతున్న వరలక్ష్మి, చిత్రంలో ప్రసన్న తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి తెలిపారు. స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో గురువారం యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొమ్మనకుండా పొగ పెట్టినట్టు కార్మికులపై పని భారం, మానసిక ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రకరకాల మెనూలు పెట్టి అందుకు తగ్గ పైసలు ఇవ్వక పోవడమే కాక కొత్తగా రాగి మాల్ట్‌ ఉదయం 8.30 గంటలకే ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశించారు. రూ.3వేలు చాలీచాలని వేతనం ఇస్తూ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని తెలిపారు. గ్యాస్‌ స్టవ్‌లు, సిలిండర్లు ఇవ్వకుండా గ్యాస్‌ స్టవ్‌పై వంట చేయాలని ఒత్తిడి చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని భారం తగ్గించాలని, మెనూలో మార్పులు చేయాలని, యూనిఫారాలు ఇవ్వాలని, హైస్కూల్లో 9, 10 తరగతి తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని తదితర డిమాండ్లతో చలో విజయవాడ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.ప్రసన్న, కమిటీ సభ్యులు శ్రీదేవి, సూర్యలక్ష్మి, సత్యవేణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.