Sep 25,2023 21:15

వినతి అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

ప్రజాశక్తి-పార్వతీపురం : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.తులసి మాట్లాడుతూ రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలు విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనాలు అమలు చేసి, ప్రతినెలా ఐదో తేదీలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి వై.శాంతికుమారి మాట్లాడుతూ మెనూ ఛార్జీలు ప్రతి విద్యార్థికి రూ.20 ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించి, ప్రమాదాలకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వంటమ్మలకు గుర్తింపు కార్డులు ఇచ్చి సామగ్రి సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఉష, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, బి.సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.