ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ కిషోర్‌కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నానుద్దేశించి మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఏలూరు జిల్లాలో మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జగనన్న గోరుముద్ద పేరుతో ఇస్తున్న మెనూఛార్జీలకు సంబంధం లేకుండా రోజుకో ఐటెంతో ప్రభుత్వం మెనూ తయారు చేసి వర్కర్లపై భారాన్ని మోపిందన్నారు. నూతన విద్యావిధానం వల్ల వర్కర్లు ఉపాధి కోల్పోతున్నారని, ఒకపక్క పనిభారం, మరోపక్క ధరల భారంతో, పెరగని మెనూ ఛార్జీలతో కార్మికులు పథకం నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. రాగిజావ తయారు చేయటానికి గ్యాస్, వంట పాత్రలు అవసరం ఎంతైనా ఉందని, వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాగిజావ తయారు చేయడానికి వంట కార్మికులు ఉదయం ఏడు గంటల నుండి పనిచేయాల్సిన పరిస్థితులున్నాయని, ధరలు పెరగడంతో వర్కర్లపైనే భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తీపి పొంగలి చేయమన్నారని మెనూలో లేనివి పెట్టడానికి వర్కర్లపై ఆర్థిక భారం పడుతుందన్నారు. జగనన్న గోరుముద్ద తినని పిల్లలకు గుడ్డు, చిక్కీ ఇవ్వాలంటున్నారని, గుడ్డు ఉడకబెట్టడానికి అయ్యే గ్యాస్ ఖర్చు అదనంగా వర్కర్లపైనే భారం పడుతుందన్నారు. పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నా ఎలాంటి వైద్య బీమా సౌకర్యం లేదని, అనేక కేంద్రాల్లో ప్రథమ చికిత్స కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. కొన్ని పాఠశాలల్లో వంట షెడ్లు, వంట పాత్రలు, తాగునీరు సరఫరా అంటే ప్రభుత్వం కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.88, అప్పర్ ప్రైమరీ హై స్కూల్ విద్యార్థికి రూ.8.57తో నాణ్యమైన భోజనం పెట్టడం ఎలా సాధ్యమో ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగాయని, వీటిని అరికట్టాలని కోరారు. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాగిజావ తయారీకి వంట పాత్రలు, గ్యాస్ స్టవ్, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వా లనీ, మెనూ ఛార్జీలు రూ.20కు పెంచాలనీ కోరారు. కనీస వేతనం ఇవ్వాలని, ప్రతీనెల ఐదో తేదీన వేతనం, బిల్లులు ఇవ్వాలనీ , గుర్తింపు కార్డులు, యూనిఫారాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షులు వై.చంద్రకళ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి, టి.స్వర్ణకుమారి, కె.విజయ, ఎం.నాగమణి, రమాదేవి, భవాని, రత్నకుమారి పాల్గొన్నారు.










