ప్రజాశక్తి-కలెక్టరేట్ : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి అందించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు శాంతికుమారి మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేయిస్తోన్న ప్రభుత్వం కనీసం తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. వేతనాలు పెంచాలని, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సబ్సిడ ధీరలకే గ్యాస్ సరఫరా చేయాలన్నారు. యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా నాయకురాలు వి.ఇందిర మాట్లాడుతూ బలిజిపేట మండలం పి.చాకరపల్లి గ్రామంలో తట్టుకోటి గణమ్మను అకారణంగా విధుల నుంచి తొలగించారని తెలిపారు. రాజకీయ వేధింపులు ఆపి, వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తులసి, కార్మికులు లక్ష్మి, పద్మ, రొయ్యబరమ్మ, పావని, సుశీల, సావిత్రి, శ్రీదేవి సిఐటియు పట్టణ నాయకులు బి.సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.










