Apr 11,2023 00:31

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -మధురవాడ, పిఎం.పాలెం : మధురవాడలోని జోన్‌-3 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయం ఆవరణలో విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పరిష్కార వేదికలో వినియోగదారులు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురు వినియోగదారులు తమ సమస్యపై వినతులను అందించారు. ఈ సందర్భంగా ఎపిఇపిడిసిఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు పరిష్కార న్యాయస్థానం చైర్మన్‌, రిటైర్డ్‌ జిల్లా జడ్జి డాక్టర్‌ బి.సత్యనారాయణ మాట్లాడుతూ, న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చిన సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు పరిధిలోని విద్యుత్‌ వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి నేరుగా, ఉత్తరం ద్వారా తీసుకురావచ్చని తెలిపారు. విద్యుత్‌ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. 4గంటలు లోపు విద్యుత్‌ అంతరాయం పరిష్కారం చేయకపోయినా దీని పరిధిలోనికి వస్తుందని తెలిపారు.
పిఎం.పాలెం: విద్యుత్‌ వినియోదారుల సమస్యల సత్వర పరిష్కరానికి న్యాయస్థానం ఏర్పాటు ఎంతో వెసులుబాట కల్పిస్తుందని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ బి.సత్యనారాయణ పేర్కొన్నారు. పిఎంపాలెంలోని సాంకేతిక కళాశాలలో విద్యార్థులకు విద్యుత్‌ సమస్యలపై అవగహన కల్పించారు. విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలపై ముందుగా తమ ప్రాంత పరిధిలోని విద్యుత్‌ కార్యాలయంలోని అసిస్టెంట్‌ ఇంజినీరు స్థాయి సిబ్బందిని సంప్రదించాలని, 1912 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే న్యాయస్థానాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.హరిబాబు, జోన్‌-3 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆపరేషన్‌ పోలాకి శ్రీనివాసరావు, మధురవాడ ఎడిఇ కిరణ్‌ కుమార్‌, ఎఇఇ రామమూర్తి, పిఎం.పాలెం ఎఇఇ ఎం.అప్పలనాయుడు, జోన్‌-3 ఎడిఇలు, ఎఇఇలు, సిబ్బంది పాల్గొన్నారు.