Mar 13,2023 01:28
జాతీయ రహదారి పక్కన మామిడి పండ్ల విక్రయం

ప్రజాశక్తి-పంగులూరు: 'మధుర ఫలం' అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే మామిడి పండ్లు ఈ సంవత్సరం ధరల పెరుగుదల కారణంగా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. వేసవికాలం ప్రారంభం నుంచి మామిడికాయలు అందుబాటులోకి వస్తాయి. .ఫిబ్రవరి 15 నుంచి ఈ ప్రాంతంలో మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. ఉలవపాడు నుంచి నాణ్యమైన మామిడికాయలను తీసుకువచ్చి జాతీయ రహదారిపై పెట్టి వ్యాపారులు అమ్ముతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కొంత అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మామిడికాయల ధరలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. డిసెంబర్‌, జనవరి నెలలో మామిడి పూత వస్తుంది. పూత వచ్చే కాలంలోనే మామిడి పూతకు తేనె మంచు పురుగు వ్యాపించడంతో, పూత, పిందె మొత్తం నల్లగా మారి, ఎదుగుదల లేకుండా రాలిపోయింది. అందువల్ల ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. దీంతో వచ్చిన కొద్దిపాటి కాయలను వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుండటంతో సామాన్య ప్రజలు మామిడికాయలను కొనే పరిస్థితి కనపడటం లేదు. జాతీయ రహదారిపై పెట్టి అమ్మే కాయలను కేజీ రూ.250 నుంచి రూ.300 వరకు చెబుతున్నారు. ఒక కేజీకి మూడు నుంచి నాలుగు కాయలు మాత్రమే వస్తాయి. ఇంత ధరపెట్టి మామిడి కాయలను కొనలేమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా సామాన్య ప్రజానీకం అత్యంత ప్రీతిపాత్రంగా తినే మామిడికాయలు ఈ సంవత్సరం పెరిగిన ధరలతో అందుబాటులో లేకుండా పోతున్నాయని అంటున్నారు.