మండు వేసవిలో మధుర రుచులు పంచే తియ్యని పండు మామిడి. మనదేశంలో పండే మామిడికి ప్రపంచ దేశాల్లో ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 50 మామిడి రకాలు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. ఒకప్పటిలా కాకుండా ఆధునిక హైబ్రీడ్ మామిడి మొక్కలు నేడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని చిన్నచిన్న కుండీల్లో, తక్కువ జాగాల్లోనూ నాటుకోవచ్చు. రకరకాల మామిడి పండ్ల పరిచయమే ఈ వారం విరితోట.
ఒకప్పుడు మామిడి మొక్క వృక్షమయితేగానీ కాపు కాసేది కాదు. అందుకు చాలా సంవత్సరాలు పట్టేది. కానీ నేడు ఆధునిక హైబ్రీడ్ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. అవి నాటిన రోజు నుంచే కాయలు కాస్తున్నాయి. అంతేనా వాటికి సీజనంటూ ఏమీ ఉండదు. సంవత్సరం పొడవునా కాపు కాస్తాయి. మామిడిపండ్లను కొందరు పండ్లలా, మరికొందరు జ్యూస్‌ల రూపంలో తీసుకుంటారు. ఇంకొందరు వాటిని పచ్చళ్లు, తాండ్ర, కూరల్లానూ తింటుంటారు. విటమిన్ ఎ, సిలతోబాటు ఎన్నో పోషకాలున్న పండు ఇది. కాబట్టే దీనిని 'ఫలొంకా రాజా!' అని పిలుస్తారు.
బంగినపల్లి
ఈ కాయ చూడటానికి గుండ్రంగా ఉండి, ఒక చివర చిన్న ముక్కుంటుంది. ఇది మన రాష్ట్ర కాయ. కర్నూలు జిల్లా బనగాపల్లి దీని పుట్టినిల్లు. బనగాపల్లి క్రమేపీ బంగినపల్లిగా మారింది. ఈ పండు చాలా తియ్యగా, మధురంగా ఉంటుంది. దీనిలో గుజ్జు ఎక్కువగా, పీచు తక్కువగా ఉంటుంది. పెద్ద మొత్తంలో తోటలు వేసి, వీటిని పెంచుతారు. విదేశాలకూ ఈ పండ్లను ఎగుమతి చేస్తారు. ఇటీవల వీటిని కుండీల్లోనూ పెంచుతున్నారు.
ఆల్ఫాన్సా
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో రారాజులా వర్ధిల్లుతున్న మామిడి ఆల్ఫాన్సా. ఒక్కో కాయా 300 గ్రాముల వరకూ ఉంటుంది. పసుపు, లేత ఎరుపు రంగుల మిశ్రమంతో కాయలు మేలిమి రంగులో నిగ నిగలాడుతూ ఉంటాయి. ఎంతో మధురమైన రుచి ఉండే ఈ కాయలు తియ్యని సువాసనలతో నోరూరిస్తాయి. ఇవి నాటిన మూడేళ్ల నుంచే కాయలు కాస్తాయి. 15 అడుగుల ఎత్తు వరకూ చెట్టు పెరుగుతుంది. గుత్తులు, గుత్తులుగా మామిడి పళ్ళు కాస్తాయి. ఈ పండు వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
బారామాసా
సంవత్సరంలో 12 నెలలు కాయలు కాసే మామిడి బారామాసా. ఇది సరికొత్త మొక్క. అంటుకట్టడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. నాటినప్పటి నుంచే కాపు కాస్తుంది. దీనిని కుండీల్లోనూ, ఇంటిదగ్గర పెంచుకోవచ్చు. ఇది చాలా తక్కువ కాయలు కాస్తుంది. దీనిని కూర, పచ్చడికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
పునాస
పునాస మామిడి ఒక్క వర్షాకాలం తప్ప మిగిలిన తొమ్మిది నెలలూ కాయలు కాస్తూనే ఉంటుంది. ఈ కాయలను పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. విందుల సమయంలో వీటితో ఆవకాయ, మాగాయ పచ్చళ్లు పెట్టుకోవచ్చు. వీటిని పప్పులోనూ, కూరల్లోనూ ఉపయోగించవచ్చు. ఈ చెట్లు 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.
కలెక్టర్
వీటి కాయలు పొడవుగా ఉంటాయి. చెట్టు నుంచి సన్నని కాడలు వేలాడుతూ ఉంటాయి. వాటికి కాయలు కాస్తాయి. ఒక్కో కాడకు ఒక్కో కాయ కాస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగానూ, పండితే గుజ్జు తియ్యగానూ ఉంటుంది. నాటిన నాల్గవ ఏట నుంచే కాపు మొదలవుతుంది. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ చెట్టు పెరుగుతుంది. ప్రతి వేసవిలో కాపు ఘనంగా ఉంటుంది. తాండ్రలు, నిలువ ఉండే జ్యూసులు, జామ్‌లు, డ్రింకులు తయారీకి ఈ మామిడిపళ్ళనే వాడతారు. ఏ రకం మామిడి తోట వేసినా మధ్యలో కలెక్టర్ మామిడిచెట్లను అక్కడక్కడ నాటతారు రైతులు. వీటివల్ల పక్కన ఉండే చెట్లకు బలం వస్తుందని, కాపు బాగా కాస్తుందనేది రైతుల నమ్మకం. తోటపురి, గినిమూతి, బెంగళూర్, కల్లామై, కిలిమోకు, గిల్లి, ముక్కు అనే పేర్లతోనూ వీటిని పిలుస్తారు. ఇంటి ఆవరణలో కాస్త జాగా ఉంటే ఈ మొక్కలు నాటుకోవచ్చు.
సువర్ణరేఖ
ఇవి కాయగా ఉన్నప్పుడు పుల్లగా, పండితే తియ్యగా ఉంటాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని రసాలుగా వాడతారు. ఇంకా పచ్చడికీ ఉపయోగపడతాయి. ఆకారంలో, పరిమాణంలో బంగినపల్లి కాయలను పోలి ఉంటాయి. నాటిన మూడేళ్లకు ఇది కాపు కాస్తుంది. 10 నుంచి 15 అడుగుల ఎత్తు వరకూ చెట్లు పెరుగుతాయి.
రసాలు
వీటిలో చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరకు రసం వంటి రకాలు ఉన్నాయి. రసాలు వివిధ ఆకృతుల్లో, వివిధ పరిమాణాల్లో ఉంటాయి. కానీ కాయలన్నీ నిండుగా పీచు, గుజ్జు కలిగి, తియ్యగా ఉంటాయి. చెట్లు 12 నుంచి 25 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. వేసవిలో ఇవి కాపు కాస్తాయి.
కొబ్బరి
మామిడి రకాల్లో కాస్త గిరాకీ ఉన్న మామిడి రకం కొబ్బరి మామిడి. తినేది కాదు. తొక్క కాస్త పలుచగా ఉంటుంది. పీచు పుష్కలంగా ఉంటుంది. కాయ చాలా రుచిగా ఉంటుంది. కాయలు సమాన సైజులో ఉంటాయి. ఈ కాయలతో మామిడి పచ్చడి పెడితే రుచిగా ఉండటమే కాక ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చెట్టు ఆరు నుంచి పది మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. వేసవి సీజన్లోనే కాపు ఉంటుంది.
- చిలుకూరి శ్రీనివాసరావు
8985945506