మధురమైన ఫలాలను ఇష్టపడని వారెవరుంటారు? ఇంట్లోనే చెట్లను పెంచి, వాటి ఫలాలను తినాలనే కోరిక మాత్రం ఎవరికి ఉండదు! ఉన్న కాస్త జాగా ఇంటికే అంతంతమాత్రంగా ఉంటుంది. ఇక మొక్కలు పెంచుకునే అవకాశం ఎక్కడిదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇకపై కుండీల్లోనే పెరిగి, మధుర ఫలాలనిచ్చే సరికొత్త హైబ్రీడ్ మొక్కలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. వనప్రియులకు ఎంతో ఆనందాన్నిచ్చే ఈ మొక్కలు ధరలో కాస్త ప్రియమే. అయినా వాటిని పెంచితే ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం !
శీతల ప్రాంతాల్లో పెరిగే సిమ్లా యాపిల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెరిగే ద్రాక్షపాదులు, విదేశాల్లో పెరిగే కివి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్స్, నిమ్మ, జామ, కమలా వంటి నోరూరించే పండ్లను ఇకపై కుండీల్లోనే పెంచుకోవచ్చు.
తీయని మామిడి
అల్ఫాన్సా, బారామాసా వంటి మామిడి మొక్కలు చక్కగా కుండీల్లోనే పెరిగి అద్భుతంగా కాపునిస్తున్నాయి. అడుగు నుంచి మూడడుగుల వరకూ ఎత్తు పెరిగి, కాయలు కాస్తున్నాయి. నాటిన ఏడాదికే కాపు కాయడం వీటి ప్రత్యేకత. సంవత్సరమంతా నిరంతరాయంగా ఒకటో, రెండో కాయలు కాస్తూనే ఉంటుంది. నల్లరేగడి, ఎర్రనేల, ఇసుకపర్రు మట్టి, కొబ్బరి పొట్టులోనూ ఇవి పెరుగుతాయి. అయితే వీటికి సేంద్రీయ ఎరువుల వాడకం ఉత్తమం. నాలుగు రోజులకొకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. పూత సమయంలో రాలకుండా తగిన మందులు వాడి, చర్యలు తీసుకోవాలి.
చైనా ఆరంజ్
కుండీల్లోనే ఎక్కువ కాయలు కాసే మొక్క చైనా ఆరంజ్. మూడు, నాలుగడుగుల ఎత్తులో ఉండే ఈ మొక్క మూడువందల వరకూ కాయలు కాస్తూ అందరినీ అబ్బురపరుస్తుంది. వీటిని చైనా నుంచి మన నర్సరీలకు దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నారు. దీని కాయలు తియ్యగా, ఎంతో మధురంగా ఉండటంతో పాటు ఏడాదిలో ఏకంగా ఎనిమిది నెలలపాటు కాపు కాస్తుంది. ఈ మొక్క ధర రూ. 25 వేల వరకు ఉంటుంది.
అందుతున్న ద్రాక్ష
అందని ద్రాక్ష పుల్లన అంటారు. కానీ ఈ అందే ద్రాక్ష మాత్రం చాలా తియ్యగా ఉంటోంది. ఇప్పటివరకు హైదరాబాదు వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇవి కాసేవి. ప్రస్తుతం సరికొత్త ద్రాక్షాలు మన ఇంట్లో కుండీల్లోనూ చక్కగా కాపు కాస్తున్నాయి. హైబ్రీడ్ రకానికి చెందిన ద్రాక్ష పాదులు కుండీల్లో అడుగు నుంచి రెండడుగుల ఎత్తులోనే గుత్తులు, గుత్తులుగా కాస్తున్నాయి. ఇసుక నేలలోనూ, కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ ఇవి పెరుగుతాయి. వీటికి నేల పొడిగా ఉండాలి. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఆకులకి తరచూ చీడపీడలు, తెగుళ్లు వస్తాయి. అప్పుడు వెంటనే తగిన క్రిమిసంహారక మందులు వాడితే సరిపోతుంది.
యాపిల్
ఎన్నో పోషక పదార్థాలున్న రుచికరమైన పండు యాపిల్. శీతల ప్రాంతాల్లో మాత్రమే ఈ పంట పండుతుంది. కడియం నర్సరీ ప్రాంతాల్లో ఈ మొక్కలు పెంచాలనేది అక్కడి ప్రజల చిరకాల వాంఛ. సరికొత్త హైబ్రీడ్ విధానంతో అది ఇన్నాళ్లకి సాకారమైంది. కాశ్మీర్ పరిసర ప్రాంతాల నుంచి కడియం నర్సరీ రైతులు ఈ మొక్కలు తెచ్చి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధిక వేడి, ఎండ ఎక్కువ తగలకుండా నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. అవి చక్కగా పెరిగి, కాయలు కాస్తున్నాయి. కుండీల్లోనూ, ప్లాస్టిక్ కవర్లలోనూ వీటిని పెంచవచ్చు. సాధారణ మట్టి, కొబ్బరి పొట్టు మిశ్రమంలో బాగా పెరుగుతాయి. వీటి చెట్టుకు ఆకులు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి రెండు నుంచి నాలుగడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.
డ్రాగన్ మొక్క
ఎన్నో పోషకాలున్న పండు డ్రాగన్. ఇది విదేశాల నుండి ఇప్పుడిప్పుడే మన దేశంలోకి వస్తోంది. ఎన్నో రోగాలకి ఈ పండు దివ్యౌషధము. దీని ధర కూడా కాస్త ఎక్కువే. నిజానికి ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క. పెద్దగా నీటి వనరు అవసరం లేదు. ఇసుక, రాళ్ల నేలల్లోనూ పెరిగే స్వభావం ఉన్న మొక్క ఇది.
టేబుల్ నిమ్మ
సిట్రస్ యాసిడ్, సి విటమిన్ ఎక్కువగా ఉండే కాయ నిమ్మ. క్యాన్సర్‌కు నిమ్మకాయ దివ్యౌషధమని అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా నిమ్మచెట్టు ముళ్ళతో ఐదారడుగులు పెరిగి, కాయలు కాస్తుంది. అడుగున్నర ఎత్తులోనే నిత్యం కాయలు కాయడం ఈ సరికొత్త హైబ్రీడ్ టేబుల్ నిమ్మ ప్రత్యేకత. ఎరుపు, ఇసుక, నల్లరేగడి నేలలు, కొబ్బరి పొట్టు వంటి వాటిలో ఇవి బాగా పెరుగుతాయి. వీటిని ఎక్కువగా జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
డ్వార్ప్ కమలా
ఈ మొక్క కుండీల్లోనే చిన్నసైజు తియ్యటి కమలాలను నిండుగా కాస్తుంది. ఇది రెండు నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎర్రమట్టి లేదా కొబ్బరి పొట్టు మిశ్రమంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. వీటినే 'హైబ్రీడ్ కమల' అని కూడా అంటారు. ఆకుపచ్చని చెట్టుకు కాషాయం రంగు కాయలు ఎంతో అందంగా, ఆకర్షణగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ కమలాలు శీతాకాలం సీజన్లో కాయలు కాస్తాయి.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506