సీజన్‌లో మాత్రమే లభించే మధురమైన ఫలాలు ఇవి. 'అన్నొన' జాతికి చెందిన పండ్లు. తేనెలూరించే ఈ జాతి పండ్లలో ఎన్నో రకాలున్నాయి. దేనికదే రుచిలో ఘనం. సీతా, రామా, లక్ష్మణా, హనుమా పేర్లతో వీటిని పిలుస్తుంటారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉన్న ఫలాలివి. ఒక్కొక్కరకం గురించి విపులంగా తెలుసుకుందాం.
అమెరికాలోని అమెజాన్ అడవులు ఈ జాతి మొక్కలకు పుట్టినిల్లు. వీటి ఆకులు నమిలితే చేదుగా ఉంటాయి. కుండీల్లోనూ, ఇళ్లల్లోనూ చిన్న చిన్న స్థలాల్లో పెరిగే అధునాతన సరికొత్త హైబ్రీడ్ మొక్కలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి.
సీతాఫలం..
కస్టర్డ్ ఆపిల్ పేరుతో పిలిచే ఈ సీతాఫలం తెలుగువారందరికీ ఎరుకే. ఇందులో పొటాషియం, క్యాల్షియం, చక్కెర, పీచు పదార్థము, పిండి పదార్థాలు, విటమిన్-సి ఉంటాయి. జలుబు సమయాల్లోనూ, మధుమేహం ఉన్నవారూ దీన్ని ఎక్కువగా ఆరగించడం కాస్త ఇబ్బందే. ఈ పండ్లు వర్షాకాలంలో కాస్తాయి. సాధారణ సీతాఫలం పది నుంచి 12 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లో కాసే హైబ్రీడ్ సీతాఫలం మాత్రం ఐదడుగుల మొక్కకే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ఇవి ఎర్రమట్టిలో బాగా పెరుగుతాయి. మొక్క మొదలు పొడిగా ఉండేటట్టు అప్పుడప్పుడూ నీరు పోయాలి.
రామాఫలం..
ఎర్రగా, నున్నగా మందని పైపొరతో ఉండే పండు రామాఫలం. 'అన్నొనా రెటీకులాటా' దీని శాస్త్రీయ నామం. మొక్క పెద్దగా, గుబురుగా 15 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీన్ని పాశ్చాత్య దేశాల్లో 'బులక్ హార్'్ట అని పిలుస్తారు. చాలా తియ్యగా ఉండే ఈ పండులో సీతాఫలంలో ఉండే అన్ని పోషక విలువలూ ఉంటాయి. కుండీల్లో పెరిగే షార్ట్ వెరైటీ మొక్క పొట్టిగా పెరిగి, కాయలు కాస్తుంది. రామాఫలంలో 75 క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్- సితో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
లక్ష్మణా ఫలం..
ఆకుపచ్చగా పది అంగుళాల వరకూ పొడవుగా ఉండేది లక్ష్మణాఫలం. తొక్క పైభాగంలో బొడుపుల్లాగా, మెత్తని ముళ్ళులాగా ఉంటుంది. లోపల గుజ్జు కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉంటుంది. మొక్క 12 అడుగుల వరకూ పెరుగుతుంది. కుండీల్లో పెరిగే డ్వార్ప్ వెరైటీ ఐదడుగుల ఎత్తులోనే కాయలు కాస్తుంది. అన్నోన్నా మురికాటా శాస్త్రీయ నామంతో పిలిచే ఈ మొక్కను 'సోర్ సూప్' అనీ అంటారు. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం, విటమిన్ - సి పుష్కలంగా ఉండే ఈ పండును క్యాన్సర్ బాధితులు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి తింటుంటారు. మార్కెట్లో ఈ పండ్లు కిలో వెయ్యి రూపాయల వరకూ ధర పలుకుతోంది.
హనుమాన్ ఫలం..
పరిమాణంలోనూ, ఆకారంలోనూ సీతాఫలంలా ఉంటుంది. కానీ పైన ఉండే తొక్క బొడిపెల్లా కాకుండా నున్నగా, పలుచగా ఉండే గుండ్రని పండు హనుమాన్ ఫలం. 'అన్నొనా చెరిమొల మిల్' దీని శాస్త్రీయ నామం. అసలు దీని రుచి మధురమే వేరు. చాలా అరుదుగా ఈ కాయలు లభిస్తాయి. మనదేశంలో ఊటీ ప్రాంతంలో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, భాస్వరం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, నీరు, ప్రోటీను, విటమిన్- సి, థియామిన్, రోబోప్లోవిన్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం మెండుగా ఉండే అరుదైన ఫలం హనుమాన్ ఫలం. ఎన్నో ఔషధాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఇది కుండీల్లో ఆరడుగుల ఎత్తు వరకూ పెరిగి, గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ఈ గింజలు కాస్త విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.
జాంభవంత ఫలం..
చూడ్డానికి సీతాఫలంలా అనిపిస్తుంది. పొడవుగా సాగుడుగా ఉంటుంది. తొక్కపై మెత్తటి ముల్లులు ఉంటాయి. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, మగ్గితే పసుపు రంగులోనూ ఉంటుంది. మొక్క సాధారణంగా 14 అడుగులు వరకూ పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం 'రోల్లినియా డెలిసియోసా'. 'అడవి చక్కెర యాఫిల్' అనీ దీనిని పిలుస్తుంటారు. బ్రెజిల్‌లో ఈ పండ్ల నుంచి వైన్ తయారుచేస్తారు. వీటి చెక్కను పడవలు, నావల తయారీకి ఉపయోగిస్తారు. మన దేశంలో వీటిని 'జాంభవంత ఫలం' అంటారు. ఈ ఫలాలకి మంచి గిరాకీ ఉంది. వీటి ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఈ ఫలాలు తినడానికి పక్షులు గుంపులు గుంపులుగా వస్తుంటాయి.
ఎల్లో సీతాఫలం..
ఇటు కనువిందు, అటు ఉదర విందు చేసేది ఎల్లో సీతాఫలం. మొక్క కుండీల్లో పొట్టిగా పెరుగుతుంది. తక్కువ కాయలు కాస్తుంది. లోపల గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. మామూలు సీతాఫలం కంటే ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఎర్రమట్టి, ఇసుకపర్రు నేలల్లో ఇవి బాగా పెరిగి, ఘనంగా కాపునిస్తాయి.
ఎర్ర సీతాఫలం..
పండు లోపల గుజ్జు ఎర్రగా నిగనిగలాడుతుంది. దీని రుచి మరే రకం సీతాఫలాలకూ ఉండదు. కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం, చక్కెర, ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్- సి మెండుగా ఉండే పండు ఎర్ర సీతాఫలం. ఈ మొక్క ఆకులు లేత పసుపు రంగులో ఉంటాయి. పండు చాలా తియ్యగా ఉంటుంది. ఈ మొక్కలు చక్కగా పెరట్లో పెరుగుతాయి. దీని పిందె, పక్వానికి వచ్చిన పండు ఒకే రంగులో ఉంటాయి. వీటిని ఇళ్లలోనూ పెంచుకోవడం సులభం.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506