Jun 04,2023 23:29

ఎస్‌పి బాలు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనకాపల్లి
సినీ చరిత్రలో అందరు హీరోలకు తన గళాన్ని పాట ద్వారా అందించిన మరచిపోలేని మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని కళ్యాణి అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ వ్యవస్థాపకులు, సినీ సంగీత దర్శకులు ఇంద్రగంటి లక్ష్మీ శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ఉడ్డుపేట కళ్యాణి అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆదివారం పద్మవిభూణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం లకీë శ్రీనివాస్‌ మాట్లాడుతూ మర్యాదరామన్న చిత్రం ద్వారా గాయకునిగా సినీ రంగప్రవేశం చేసి 2020 సంవత్సరం వరకు 50,000కు పైగా పాటలు పాడారని తెలిపారు. సంగీత దర్శకునిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటునిగా, నిర్మాతగా అనేక శాఖలలో తనదైన ముద్రను వేశారని కొనియాడారు. 2002 జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవం రోజునే తన కళ్యాణి అకాడమి ప్రారంభ ముహూర్తం బాలు సూచించారని తెలిపారు. అనంతరం కళ్యాణి అకాడమి విద్యార్థులు ఆలపించిన బాలు మధుర గీతాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో అకాడమి ప్రిన్సిపాల్‌ నడిగట్ల వెంకటలక్ష్మి, డిస్ట్రిక్ట్‌ విజిలెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ మెంబర్‌ (డివిఏంసి) రేబాక మధుబాబు, అకాడమి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.